ఆ ట్రాన్స్‌లో నుంచి బయటికి రావాల్సిందేనా?
టాలీవుడ్ గురించి మాట్లాడాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని చెప్పక తప్పదు.
By: Tupaki Desk | 11 July 2025 10:00 PM ISTటాలీవుడ్ గురించి మాట్లాడాలంటే బాహుబలికి ముందు బాహుబలి తరువాత అని చెప్పక తప్పదు. ఏ ముహూర్తాన రాజమౌళి `బాహుబలి` సిరీస్‌ని మొదలు పెట్టాడో కానీ అదే టాలీవుడ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. మూస ధోరణి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ అనే విమర్శల నుంచి `టాలీవుడ్ దిబెస్ట్ ఇన్ ఇండియన్ సినిమా`గా ప్రశంసలు పొందేవరకు మారింది. అంతే కాకుండా బిజినెస్ పరంగా, ఓటీటీ డీల్స్ పరంగా, డబ్బింగ్ రైట్స్ పరంగా తెలుగు సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇక పాన్ ఇండియా సినిమాలకు మరింతగా ఆదరణ పెరిగింది కూడా మన వళ్లే. అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పులు తెచ్చి పెడుతోంది. పాన్ ఇండియా సినిమాలతో ఎంతగా టాలీవుడ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిందో ఇప్పుడు అదే పాన్ ఇండియా ఫార్ములా కారణంగా మసకబారుతోంది. కారణం పాన్ ఇండియా సినిమాలంటూ కొంత మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు చేస్తున్న ప్రాజెక్ట్‌లే. `బాహుబలి` తరువాత తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగడం, హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు.
ఏ హీరోను కదిలించినా పాన్ ఇండియా పాటే పాడుతున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వరుస డిజాస్టర్లకు ప్రధాన కారణంగా మారుతోంది. ప్రతి హీరో పాన్ ఇండియా అంటున్నారే కానీ ఆ స్థాయి కథలని ఎంచుకోవడం లేదని, ఆ కారణంగానే వరుస డిజాస్టర్లు ఎదురవుతున్నాయని పలువురు ట్రేడ్ పండితులు వాపోతున్నారు. చివరికి చిన్న హీరో కూడా పాన్ ఇండియా జపం చేయడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది.
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇదే పాట పాడేస్తూ మనం ఎంచుకున్న కథకు ఆ స్కోప్ ఉందా? లేదా అని ఆలోచించకుండా ప్రతీదీ పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేయడం, అదే స్థాయిలో రిలీజ్ చేయడంతో అసలు సమస్య మొదలైందని, ఇప్పటికైనా టాలీవుడ్ ఆ ట్రాన్స్‌లో నుంచి బయటికి రావాల్సిందేనని ట్రేడ్ వర్గాలతో పాటు సగటు ప్రేక్షకుడు సెటైర్లు వేస్తున్నాడు. మరి దీన్ని ఇప్పటికైనా గమనించి టాలీవుడ్ వర్గాలు పాన్ ఇండియా ట్రాన్స్ నుంచి బయటపడతారా? అన్నది వేచి చూడాల్సిందే.
