Begin typing your search above and press return to search.

ఈ రైతుబిడ్డ సెంటిమెంట్ ఏందిరా బాబు?

ఒక వీడియోలో.. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని.. ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని.. కారును ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ అక్కడి పోలీసు ఒకరు హెచ్చరిస్తున్నా.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:27 AM GMT
ఈ రైతుబిడ్డ సెంటిమెంట్ ఏందిరా బాబు?
X

ఛీ.. ఛీ..మరీ ఇంత బాధ్యతారాహిత్యమా? సెలబ్రిటీ కాగానే సరిపోదు. కాస్తంత బాధ్యత ఉండాలన్నట్లుగా ఉంది బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తీరు. బిగ్ బాస్ సీజన్7 విజేతగా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచిబయటకు వచ్చిన సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు.. అతడి అభిమానుల పేరుతో ఆరు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేయటం.. మిగిలిన సెలబ్రిటీల్ని అడ్డుకొని.. వారి కార్లను ధ్వంసం చేయటం లాంటి పరిణామాల్ని చూస్తే.. ఈ ఆరాచకం ఏంది సామీ అనిపించకమానదు.

పరిస్థితి అదుపు తప్పటం.. రైతుబిడ్డ అభిమానుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. హింసకు పాల్పడుతున్న వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతుంటే.. కారులో కూర్చున్న విజేత పల్లవి ప్రశాంత్ మాత్రం తాను రైతుబిడ్డనని.. తనకు ఈ మాత్రం విలువ ఇవ్వరా? అంటూ భావోద్వేగపు బ్లాక్ మొయిలింగ్ కు పాల్పడతాన్ని పలువురు తప్పు పడుతున్నారు. గడిచిన రెండు రోజులుగా బయటకు వస్తున్నకొన్ని వీడియోలు.. వాటిల్లో రైతుబిడ్డ బిహేవ్ చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తగలబడిపోతుంటే.. దాన్ని వదిలేసి.. రైతుబిడ్డ సెంటిమెంట్ డైలాగులు ఏందిరా నాయనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఒక వీడియోలో.. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని.. ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని.. కారును ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ అక్కడి పోలీసు ఒకరు హెచ్చరిస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా.. "అన్నా ఏందిది.. ఒక రైతుబిడ్డకు ఇంత విలువ ఇవ్వట్లేదంటూ" చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని చూసిన తర్వాత కూడా తన కారణంగా తప్పు జరగొద్దు.. పరిస్థితి చేజారొద్దన్న కనీస అవగాహన లేకుండా రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లో సెంటిమెంట్ డైలాగ్ ను బయట కూడా చెప్పటాన్ని తప్పు పడుతున్నారు.

ఇలాంటి వారిపై సీరియస్ చర్యలు ఉండాలంటున్నారు. అంతేకాదు.. బిగ్ బాస్ షో నిర్వాహకుల్ని సైతం తప్పు పడుతున్నారు. పరిస్థితిని ఇంతవరకు తెచ్చేసిన వైనాన్నిప్రశ్నిస్తున్నారు. ముందస్తుగా పోలీసు ప్రొటెక్షన్ భారీగా ఉండటంతో పాటు.. ఎమోషనల్ పరిస్థితులు ఉంటే.. స్టూడియోలోనే ఒక రోజు ఉంచేసి.. తర్వాతి రోజు పంపితే సరిపోతుంది కదా? అలా కాకుండా అప్పటికప్పుడు బయటకు పంపేసిన వైనాన్ని తప్పు పడుతున్నారు. ఏమైనా.. సెలబ్రిటీలు అన్న వారు మిగిలిన వారి కంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి.. తమ ఇమేజ్ పెంచుకోవటానికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సెంటిమెంట్ డైలాగులు పలికే తీరును ఖండించాల్సిందే. బాధ్యత లేకుండా వ్యవహరించిన పల్లవి ప్రశాంత్ మీదా.. బిగ్ బాస్ నిర్వాహకుల మీదా..గొడవలకు పాల్పడిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అప్పుడే సరైన సందేశాన్ని పంపినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.