పాక్ లో రామాయణం నాటకం సూపర్ హిట్
కొన్ని దేశాల మీద కొన్ని ముద్రలు పడతాయి. వాస్తవానికి ఆ ముద్రల్లో నిజం ఎంత? అన్న విషయంపై క్రాస్ చెక్ ఉండదు.
By: Tupaki Desk | 14 July 2025 11:30 AM ISTఅవును.. దాయాది పాకిస్థాన్ లో రామాయణ నాటకాన్ని ప్రదర్శించటమే కాదు.. దానికి విశేషమైన ఆదరణ లభించటం ఆసక్తికరంగా మారింది.
కరాచీ నగరానికి చెందిన ఒక నాటక బృందం అనూహ్య రీతిలో రామాయణాన్ని నాటకంగా ప్రదర్శించింది. ఇందులో నటించిన కళాకారులంతా పాకిస్తానీయులే కావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ నాటకానికి స్థానికంగా విశేష ఆదరణ లభించటం.. ప్రశంసలు వెల్లువెత్తటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాక్ కు చెందిన యోగేశ్వర్ కరేరా.. రాణా కజ్మాలకు నాటక రంగం మీద ఉన్న మక్కువతో థియేటర్ ఆర్ట్స్ తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు.
వీరంతా కలిసి కొందరితో కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డారు. దీనికి మౌజ్ అనే పేరు పెట్టారు. గత నవంబరులో తొలిసారి ‘ది సెకండ్ ఫ్లోర్’ పేరుతో ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి ఆదరణ రావటంతో పాక్ నాటక రంగంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ నాటకానికి మరిన్ని హంగుల్ని జోడించి.. ఏఐ సాయంతో మరిన్ని హంగుల్ని అద్దారు.
తాజాగా కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ లో మూడు రోజుల పాటు రామాయణ నాటకాన్ని ప్రదర్శించటం.. దానికి అనూహ్య స్పందన రావటం అందరిని ఆకర్షిస్తోంది. రామాయణ నాటకాన్ని ప్రదర్శిస్తే.. స్థానికంగా విమర్శలు.. బెదిరింపులు ఎదుర్కొంటామన్న భావన తమకు ఎప్పుడూ కలగలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా వెల్లడించారు. ఈ పురాణ కథకు స్థానికుల నుంచి విశేష ఆదరణ లభించినట్లుగా పేర్కొన్నారు. ఈ నాటకంలో సీత పాత్రధారిగా రాణా కజ్మా నటించారు. మొత్తంగా పాకిస్థాన్ లో రామాయణ నాటక ప్రదర్శనకు వచ్చిన స్పందన చూసినప్పుడు ఆ దేశం మీద ఉండే నెగిటివ్ ఆలోచనల్ని కాస్తంత తగ్గించేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
