దంగల్ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక పోయా.. పాక్ మంత్రి విచారం
2016లో నితేష్ తివారీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా దంగల్. మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
By: Tupaki Desk | 27 Jun 2025 11:05 AM IST2016లో నితేష్ తివారీ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా దంగల్. మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహావీర్ సింగ్ తన కూతుళ్లను వరల్డ్ వైడ్ రెజ్లర్లుగా తయారు చేయడానికి ఇచ్చిన కఠోర ట్రైనింగ్, స్పోర్ట్స్ వరల్డ్ లో వారు సాధించిన విజయాలను దంగల్ లో ఎంతో బాగా చూపించారు. దంగల్ లో మహావీర్ సింగ్ ఫొగాట్ పాత్రలో ఆమిర్ నటించి తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
దంగల్ సినిమా రిలీజైన టైమ్ లో మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. కానీ ఇలాంటి సూపర్ హిట్ సినిమా పాకిస్తాన్ లో రిలీజవకపోవడం విశేషం. దంగల్ సినిమా రిలీజ్ టైమ్ లో పాక్ ఈ సినిమాను రిలీజ్ కానీయకుండా బ్యాన్ చేసింది. దంగల్ ను బ్యాన్ చేసినందుకు ఇప్పుడు ఆ దేశ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
తాను పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రిగా ఉన్న టైమ్ కు సంబంధించి విచారకరమైన విషయం ఏదైనా ఉందా అంటే అది దంగల్ సినిమాను నిషేధించడమేనని తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్ లో తెలిపారు. తాను పాక్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న టైమ్ లోనే ప్రపంచవ్యాప్తంగా దంగల్ రిలీజైందని ఆమె చెప్పారు. సెన్సార్ బోర్డు, సమాచార శాఖ ఆఫీసర్లతో అదే తన మొదటి మీటింగ్ అని, కొన్ని కారణాలను చెప్తూ దంగల్ పై నిషేధం విధించాలని వారు చెప్పడంతో ఆ సినిమా చూడకుండానే దంగల్ ను బ్యాన్ చేయడానికి ఆమోదం తెలిపానని ఆమె వెల్లడించారు.
ఆ తర్వాత ఏడాదిన్నరకు దంగల్ చూసి, తాను తీసుకున్న డెసిషన్ తప్పని గ్రహించానని, ఆ సినిమా అమ్మాయిలకు ఎంతో ఇన్సిపిరేషనల్ మూవీ అని ఆమె తెలిపారు. దంగల్ సినిమా పాక్ లో రిలీజ్ కాకపోవడంపై రీసెంట్ గా ఆమిర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత జెండాను, జాతీయ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలని పాక్ సెన్సార్ సూచించిందని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో సినిమా అక్కడ రిలీజవలేదని ఆమిర్ చెప్పారు. పాక్ లో దంగల్ రిలీజవకపోతే కలెక్షన్లు తగ్గుతాయని ఎంతమంది చెప్పినా తాను మాత్రం ఆ విషయంలో వెనుకడుగేయలేదని, ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేనికీ తాను సపోర్ట్ చేయనని ఆమిర్ క్లారిటీ ఇచ్చారు.
