యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ మాజీ ఎస్ఐ నసీర్ ఢిల్లాన్‌తో లింకులు
దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ పోలీసుల మాజీ సబ్-ఇన్‌స్పెక్టర్ నసీర్ ఢిల్లాన్ తో నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది
By: Tupaki Desk | 7 Jun 2025 8:00 PM ISTభారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్య కేసులో కొత్త విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ పోలీసుల మాజీ సబ్-ఇన్‌స్పెక్టర్ నసీర్ ఢిల్లాన్ తో నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నసీర్ ఢిల్లాన్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా రహస్య గూఢచర్య కార్యకలాపాలు నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. మల్హోత్రా ఢిల్లాన్‌తో నేరుగా టచ్‌లో ఉంది. అంతేకాదు, ఒక పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. మల్హోత్రా పాకిస్థాన్ పర్యటనలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసినట్లు చెబుతున్నారు.
పాకిస్థాన్ పోలీసుల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత నసీర్ ఢిల్లాన్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. మొదట్లో, అతను భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే వ్యక్తిగా కనిపించాడు. అయితే, దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ బహిరంగ ప్రచారం వెనుక పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), సైన్యం నడుపుతున్న ఒక రహస్య సీక్రెట్ మిషన్ ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఢిల్లాన్ పాకిస్థానీ గూఢచర్య ఏజెన్సీకి ఒక వారధిగా పనిచేశాడు. అతను తన యూట్యూబ్ ఛానెల్‌ను ఉపయోగించి భారతీయ యూట్యూబర్‌లను సంప్రదించేవాడు. వారితో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత, వారిని ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేసేవాడు. ఆ తర్వాత, భారత సైన్యం, భద్రతా సంస్థల గురించి రహస్య సమాచారం సేకరించాలనే లక్ష్యంతో వారికి మెల్లగా పనులు అప్పగించేవాడు.
36 ఏళ్ల జ్యోతి మల్హోత్రా ఈ నెట్‌వర్క్ ద్వారా మోసపోయిన యూట్యూబర్‌లలో ఒకరని భావిస్తున్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఉద్యోగి ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ తో కూడా ఢిల్లాన్‌కు సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు ధృవీకరించాయి. డానిష్‌ను గూఢచర్య అనుమానంతో భారత అధికారులు మే 13న దేశం నుంచి బహిష్కరించారు.
ఢిల్లాన్, డానిష్ మధ్య సంబంధం గురించిన తగిన ఆధారాలు దర్యాప్తు అధికారులకు లభించాయి. ఇది దౌత్యపరమైన ముసుగులో పనిచేస్తున్న ఒక పెద్ద సీక్రెట్ ముఠా నడుపుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాను మే 16న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి స్థానిక పోలీసులు, కేంద్ర నిఘా ఏజెన్సీలు ఆమెను చాలాసార్లు విచారించాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న 12 మంది వ్యక్తులలో ఆమె కూడా ఒకరు.
