Begin typing your search above and press return to search.

పహల్గామ్‌ ఉగ్రదాడి... ఫిల్మ్‌ మేకర్స్ ప్రత్యామ్నాయం

మొన్నటి వరకు అందమైన స్విట్జర్లాండ్ అంటూ పేరు సొంతం చేసుకున్న పహల్గామ్‌ ఇప్పుడు ఉగ్రవాదుల భయంతో వణికి పోతుంది.

By:  Tupaki Desk   |   25 April 2025 12:00 PM IST
Major Blow For Pahalgam Tourism
X

పహల్గామ్‌ ఉగ్రదాడి దేశం మొత్తం ఉలిక్కి పడే విధంగా చేసింది. అమాయకులైన పర్యాటకులపై దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల చర్యను మొత్తం ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తోంది. సామాన్యుల నుంచి అగ్ర దేశం వరకు అంతా ఉగ్రదాడి అనైతికం అంటూ ఉగ్రవాదులను క్షమించకూడదంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. దేశం మొత్తం పహల్గామ్‌ కోసం నిలబడేందుకు సిద్ధంగా ఉంది. కానీ అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పర్యాటకంపై అక్కడి వారు జీవనం సాగిస్తున్నారు. వచ్చే పర్యాటకులకు సర్వీస్ ఇవ్వడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రతి రోజు వేలాది మంది పర్యాటకులు అక్కడకు వెళ్లే వారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యాటకులు అక్కడకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

మొన్నటి వరకు అందమైన స్విట్జర్లాండ్ అంటూ పేరు సొంతం చేసుకున్న పహల్గామ్‌ ఇప్పుడు ఉగ్రవాదుల భయంతో వణికి పోతుంది. అక్కడకు వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి నెలకొంది. చాలా మంది ప్రాణాలను తీసుకున్న ఉగ్రవాదులు మళ్లీ ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే ఇప్పటికే ప్లాన్‌ చేసుకున్న చాలా మంది పర్యాటకులు ఉగ్రదాడి నేపథ్యంలో తమ పర్యటన రద్దు చేసుకున్నారు. కేవలం పర్యాటకులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సైతం తమ షూటింగ్స్‌ను రద్దు చేసుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా సినిమాల షూటింగ్స్ పహల్గామ్‌లో జరిగాయి. కొన్ని నెలల క్రితం నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పహల్గామ్‌లో జరిగింది. అంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఒక సినిమా షూటింగ్‌ సైతం అక్కడ జరిగింది. కొన్ని చిన్న సినిమాలు, కొన్ని పెద్ద సినిమాలు ఇలా చాలా సినిమాల షూటింగ్‌ అక్కడ జరిగాయి, ముందు ముందు కూడా జరపాలని భావించారు. కానీ అక్కడ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిల్మ్‌ మేకర్స్ ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్నారని సమాచారం అందుతోంది. ఇండియా స్విట్జర్లాండ్ అంటూ పేరున్న పహల్గామ్‌లో ఉగ్రదాడి ఇండస్ట్రీకి నష్టమే.

రాబోయే రెండు మూడు ఏళ్ల వరకు అక్కడ పూర్తి స్వేచ్ఛగా షూటింగ్ జరిపేందుకు మేకర్స్ భయపడే పరిస్థితి ఉంటుంది. అందుకే పహల్గామ్‌లో మునుపటి పరిస్థితులు వెంటనే ఏర్పడే అవకాశాలు లేవని జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ మాత్రమే కాకుండా చాలా భాషల సినిమాల షూటింగ్స్‌ అక్కడ జరిగాయి. చాలా మంది స్టార్స్‌కి ఆ ప్రదేశంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి పహల్గామ్‌ లో ఉగ్రదాడి జరిగి పర్యాటకులను ఎంపిక చేసుకుని మరీ చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం. మతం పేరుతో హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిందే అంటూ ప్రభుత్వంను ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.