దేశం లోపలి నుంచే శుద్ధి మొదలుపెట్టాలి
కానీ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యూవతి రోడ్లపై అంటించిన పాక్ జెండాలను తొలగించి, దాన్ని తొక్కనీయకుండా అడ్డుకోవడంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 6:35 AMపహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసింది. అమాయకులైన టూరిస్టులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో కోపంతో రగిలిపోతున్నారు. ఆ ఉగ్రదాడికి నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
ఉగ్రవాద శక్తులపై నినాదాలు చేస్తూ, తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉగ్రవాదం నశించాలి, భారత్‌మాతాకీ జై అంటూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి దాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఉగ్రదాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలంతా ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తున్నారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిస్కషనే జరుగుతుంది. #PahalgamAttack, #IndiaAgainstTerrorism లాంటి హ్యాష్ ట్యాగులతో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దేశంలోని ప్రజలంతా ఒకతాటిపై నిలబడి ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాని రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిరసన తెలుపుతున్నారు.
కానీ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యూవతి రోడ్లపై అంటించిన పాక్ జెండాలను తొలగించి, దాన్ని తొక్కనీయకుండా అడ్డుకోవడంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళతో గొడవ పడి పాక్ జెండాని తిరిగి రోడ్డుపై అంటించాలని కోరినప్పటికీ ఆమె దానికి నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ విషయంలో తాజాగా టాలీవుడ్ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. మన సైనికులు వారి ప్రాణాలను అడ్డుగా వేసి దేశాన్ని కాపాడుతుంటే, కొందరు దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం ఎంతో బాధగా ఉందని, దేశం లోపలి నుంచే శుద్ధిని మొదలుపెట్టాలని లావణ్య త్రిపాఠి పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.