Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పారిజాత పర్వం

By:  Tupaki Desk   |   19 April 2024 8:58 AM GMT
మూవీ రివ్యూ : పారిజాత పర్వం
X

'పారిజాత పర్వం' మూవీ రివ్యూ

నటీనటులు: చైతన్య రావు-శ్రద్ధా దాస్-సునీల్-హర్ష చెముడు-మాళవిక సతీశన్-శ్రీకాంత్ అయ్యంగార్-సురేఖా వాణి-సమీర్ తదితరులు

సంగీతం: రీ

ఛాయాగ్రహణం: బాల సరస్వతి

నిర్మాతలు: మహిధర్ రెడ్డి-దేవేష్ శ్రీనివాసన్

రచన-దర్శకత్వం: సంతోష్ కంభంపాటి

'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత 'కీడా కోలా' సహా కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన టాలెంటెడ్ యాక్టర్ చైతన్యరావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త చిత్రం.. పారిజాత పర్వం. ట్రైలర్ చూస్తే మంచి క్రైమ్ కామెడీలా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చైతన్య (చైతన్య రావు) దర్శకుడు కావాలని ఆశపడుతున్న కుర్రాడు. సినిమా హీరో కావాలనుకుని అనుకోకుండా రౌడీగా మారిన బార్ శీను (సునీల్) నిజ జీవిత కథనే స్క్రిప్టుగా మలిచి తన ఫ్రెండు హర్ష (హర్ష చెముడు)నే హీరోగా పెట్టి సినిమా తీయాలని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ కథ నచ్చినా హర్ష హీరోగా సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాడు. ఈ పరిస్థితుల్లో తమ కష్టాలు తీరాలన్నా, తమ కలలు నెరవేరాలన్నా ఒకటే మార్గం అనుకుని శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) అనే నిర్మాత రెండో భార్య సురేఖ (సురేఖా వాణి)ని కిడ్నాప్ చేయడానికి సిద్ధపడతారు చైతన్య.. హర్ష. ఐతే వాళ్లు శెట్టి ఇంటికి వెళ్లేలోపే ఇంకెవరో సురేఖను కిడ్నాప్ చేస్తారు. వీళ్లు వేరే అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తారు. ఆ అమ్మాయి ఎవరు..? ఇంతకీ సురేఖను కిడ్నాప్ చేసిందెవరు..? ఈ చిక్కుముడి నుంచి బయటపడి చైతన్య అనుకున్నది సాధించాా? ఈ ప్రశ్నలన్నంటికీ సమాధానాలు తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

క్రైమ్ కామెడీ అనేది ఎవర్ గ్రీన్ జానర్. టాలీవుడ్లో ఈ జానర్లో క్షణక్షణం.. మనీ.. స్వామి రారా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి ఆల్ టైం ఫేవరెట్ సినిమాలు వచ్చాయి. ఐతే ఈ తరహా కథలను డీల్ చేయడం ఒక కళ. పైన చెప్పుకున్న చిత్రాలన్నింటినీ గమనిస్తే.. వాటిలో కథ సీరియస్ గా.. పకడ్బందీగా ఉంటుంది. పాత్రలు సీరియస్ గానే ప్రవర్తిస్తాయి. కామెడీ కోసమని క్యారెక్టర్లు సిల్లీగా ప్రవర్తించవు. తెర మీద వ్యవహారమంతా సీరియస్ గానే సాగుతుంటే చూసే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సందర్భోచితంగా హాస్యమూ పండుతుంది. కానీ ఈ మధ్య వస్తున్న క్రైమ్ కామెడీల్లో కథలే మరీ తేలికగా ఉంటున్నాయి. లాజిక్కుల్లేని కథలు.. సిల్లీ క్యారెక్టర్లతో ఈ జానర్ సినిమాలంటే జనాలు లైట్ తీసుకునేలా చేస్తున్నారు ఈ తరం దర్శకులు. తరుణ్ భాస్కర్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా 'కీడా కోలా'ను ఇలాగే నడిపించి ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాడు. ఇప్పుడు సంతోష్ కంభంపాటి అనే కొత్త దర్శకుడు చేసిన 'పారిజాత పర్వం'ను అయితే ప్రేక్షకులు ఏ దశలోనూ సీరియస్ గా తీసుకునే అవకాశమే ఉండదు. అంత సాధారణంగా.. సిల్లీగా సాగిపోతాయి ఇందులోని కథాకథనాలు.

హీరో అవ్వాలని హైదరాబాద్ కు వచ్చి ఒక బార్లో వెయిటర్ అయ్యే క్యారెక్టర్ ఒకటి. సినిమాల్లో డ్యాన్సర్ గా వెలిగిపోవాలనుకుని అదే బార్లో డ్యాన్స్ చేస్తుంటుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి బార్ యజమాని వల్ల ఇబ్బంది వస్తే అతణ్ని చంపేసి పెద్ద డాన్ అయిపోతాడు ఆ వెయిటర్. ఈ వెయిటర్ కథనే సినిమా స్క్రిప్టుగా మార్చి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తుంటాడు ఇంకో కుర్రాడు. ఈ కథను ఏ నిర్మాతకు చెప్పినా ఆహా అద్భుతం అంటుంటారు. పైగా ఓ నిర్మాత అయితే వెంకటేష్ కు ఈ కథ బాగా సూటవుతుంది నేను ఒప్పిస్తా అంటాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్లతో మొదలైన సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం సీరియస్ గా తీసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కటంటే ఒక్కటీ సహజంగా.. లాజికల్ గా అనిపించే పాత్ర కాదు. అసలు నిర్మాతలు పెద్ద హీరోలను పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతుంటే.. తన ఫ్రెండునే పెట్టి సినిమా తీస్తానని హీరో పట్టుబట్టడం ఏంటో అర్థం కాదు. పోనీ ఆ ఫ్రెండు ఏమైనా మంచి నటుడు అనే సంకేతాలు ఇస్తారా.. ప్రేక్షకులకు కూడా అలాంటి ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా అంటే అదీ లేదు. ఈ విషయంలో హీరో మొండితనమే చిత్రంగా అనిపిస్తుంటే.. నిర్మాతలు తన ఫ్రెండుని హీరోగా ఒప్పుకోలేదని ఏకంగా కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకోవడం మరీ విడ్డూరం.

ఇక కిడ్నాప్ వ్యవహారం అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. కిడ్నాప్ అంటే ఇంత చిన్న విషయమా అనిపించేలా ఎవరికి వాళ్లు ప్లాన్లు వేసేసి ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ చేసేస్తుంటారు. కిడ్నాప్ అయిన మహిళ భర్తతో వేర్వేరు కిడ్నాప్ గ్యాంగ్స్ సాగించే బేరసారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్రైమ్ కామెడీలకు కథనంలో వేగం చాలా కీలకమైన విషయం. సన్నివేశాలు పరుగులు పెట్టాలి. కొంచెం హడావుడి ఉండాలి. కానీ 'పారిజాత పర్వం' మాత్రం డల్లుగా.. స్లోగా సాగిపోతుంటుంది. సిల్లీ సీన్లు.. జోకులతో కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అక్కడక్కడా హర్ష చెముడు.. శ్రీకాంత్ అయ్యంగార్.. సునీల్.. ఈ ముగ్గురూ కొంచెం నవ్వులు పంచబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే సినిమా పూర్తయ్యేదాకా కూర్చోవడం కూడా కష్టమే. ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని ట్విస్టులు ఓకే అనిపిస్తాయి. కానీ ఇలంటి ట్విస్టులు బోలెడన్ని క్రైమ్ కామెడీల్లో చూశాం. ఈ కథ వినడానికి ఓకే అనిపిస్తుందేమో కానీ.. తెర మీద మాత్రం ఎగ్జిక్యూషన్ తేలిపోయింది. సీరియస్ గా తీసుకోలేని కథ.. పాత్రల వల్ల 'పారిజాత పర్వం' ఏ దశలోనూ ఎంగేజింగ్ గా అనిపించదు.

నటీనటులు:

చైతన్య రావు పెర్ఫామెన్స్ ఓకే. అతను సినిమాలో ఒక పాత్రధారిలా కనిపిస్తాడు తప్ప హీరోలా ఏమీ లేడు. తన పాత్రే చాలా సాధారణంగా అనిపించడంతో చైతన్యరావు ప్రత్యేకంగా ఏమీ చేయడానికి లేకపోయింది. దీంతో పోలిస్తే 'కీడా కోలా'లో చైతన్య చాలా బెటర్ గా అనిపిస్తాడు. అతడికి జోడీగా నటించిన మాళవిక సతీశన్ చాలా మామూలుగా అనిపిస్తుంది. తనకు చెప్పుకోదగ్గ పాత్రా ఇవ్వలేదు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై మెరిసిన శ్రద్ధా దాస్.. తన గ్లామర్ తో కొంత ఆకట్టుకుంది. బార్ శీను పాత్రలో సునీల్ మెప్పించాడు. ఈ మధ్య అతను కామెడీ చేస్తుంటే ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ సినిమాలో పర్వాలేదనిపించాడు. హర్ష చెముడు.. శ్రీకాంత్ అయ్యంగార్ ఈ బోరింగ్ సినిమాలో కొంత రిలీఫ్ ఇచ్చారు. సురేఖావాణి కీలకమైన పాత్రలో రాణించింది. సమీర్.. మిగతా ఆర్టిస్టులు ఓకే.

సాంకేతిక వర్గం:

'పారిజాత పర్వం'లో సాంకేతిక హంగులు అంతంతమాత్రమే. రీ సంగీతంలో మెరుపులు లేవు. పాటలకు ప్రాధాన్యం లేని సినిమాలో వచ్చే ఒకట్రెండు పాటలు కూడా మొక్కుబడిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం క్రైమ్ కామెడీల స్టయిల్లో ఏదో అలా అలా సాగిపోయింది. బాల సరస్వతి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల్లో పరిమితులు కనిపిస్తాయి. రైటర్ కమ్ డైరెక్టర్ సంతోష్ కంభంపాటి ఎంచుకున్న కథలో బేసిక్ ఐడియా బాగుంది. కానీ దాన్ని పకడ్బందీ స్క్రిప్టుగా మార్చలేకపోయాడు. రైటింగ్ దగ్గరే సినిమా తేలిపోయింది. స్క్రీన్ ప్లేలో బిగి లేదు. ఇక టేకింగ్ అయితే మరీ సాధారణంగా సాగిపోయింది.

చివరగా: పారిజాత పర్వం.. పరీక్షిస్తుంది సహనం

రేటింగ్- 2/5