Begin typing your search above and press return to search.

మా హీరో రియల్‌ సూపర్‌ స్టార్‌.. ఎందుకో తెలుసా!

తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి తన మంచి మనసును చాటుకోబోతున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 7:33 AM GMT
మా హీరో రియల్‌ సూపర్‌ స్టార్‌.. ఎందుకో తెలుసా!
X

తమిళ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి తన మంచి మనసును చాటుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వేలాది మందికి సహాయం గా నిలిచిన రజినీకాంత్ పేదవారి ఆరోగ్యం కోసం చెన్నై శివారు ప్రాంతంలో అతి పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం అందుతోంది.


తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చెన్నై కి సమీపంలో ఉండే తిరుప్పుపూర్‌ లో దాదాపుగా 12 ఎకరాల భూమిని రజినీకాంత్ కొనుగోలు చేశారని, అక్కడ ఓ భారీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయని, ప్లాన్ రెడీ అవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పేదల కోసం ప్రత్యేకంగా ఆ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారట. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందబోతున్న ఆ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రజినీకాంత్‌ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే భూమి పూజ ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్‌ అభిమానులు ఈ వార్త తెలిసి మా హీరో రియల్‌ సూపర్‌ స్టార్‌ అంటూ మురిసి పోతున్నారు. ఇండియాలో ఎంతో మంది స్టార్స్ మరియు సూపర్‌ స్టార్స్ ఉన్నారు. కానీ వారికి రాని ఆలోచన, వారు చేయాలనుకోని సేవ ను రజినీకాంత్‌ చేసేందుకు సిద్ధం అవ్వడం అభినందనీయం.

గతంలో రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని భావించారు. కానీ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకున్నా కూడా ప్రజా సేవ చేయాలని ఈ ఆసుపత్రి మొదలు పెట్టబోతున్నారు. ఈ ఆసుపత్రి విషయమై అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్నారు.