Begin typing your search above and press return to search.

OTT సంక్షోభం గురించి మీకెంత తెలుసు?

క‌రోనా క్రైసిస్ ముగిసిన‌ తర్వాత OTTల ద‌శ తిరిగిపోయింది. సినిమా వీక్ష‌ణ‌లో కొత్త‌ద‌నాన్ని ఇటీవ‌ల‌ ప్ర‌జ‌లు ఆస్వాధిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 11:30 PM GMT
OTT సంక్షోభం గురించి మీకెంత తెలుసు?
X

క‌రోనా క్రైసిస్ ముగిసిన‌ తర్వాత OTTల ద‌శ తిరిగిపోయింది. సినిమా వీక్ష‌ణ‌లో కొత్త‌ద‌నాన్ని ఇటీవ‌ల‌ ప్ర‌జ‌లు ఆస్వాధిస్తున్నారు. ముఖ్యంగా యువ‌తరం స్మార్ట్ వీక్ష‌ణ‌కు ఘ‌న‌నీయంగా అల‌వాటు ప‌డిపోయింది. యువ‌త‌ను మార్చ‌డంలో ఓటీటీలు ఘ‌న‌విజయం సాధించాయి. ఇది డిజిటల్ హక్కుల్లో మరింత మార్కెట్‌ను సృష్టించింది. ఈ హక్కులు నిర్మాతలకు సినిమాపై అయ్యే ఖర్చులను రికవరీ చేయడంలో సహాయపడ్డాయి. కాబట్టి కొంతమంది నిర్మాతలు OTT ఒప్పందాల నుండి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయడం ప్రారంభించారు. స్ట్రీమింగ్ వేదిక‌ల‌కు సినిమాలు కంటెంట్ ను విక్ర‌యించ‌డంలో నిర్మాత‌లు స్పీడ్ గా ఉన్నారు. అయితే ఈ ప్రక్రియలో సినిమాల నాణ్యత తగ్గి OTT ప్లాట్‌ఫారమ్‌లకు నష్టాల‌కు కార‌ణ‌మైంది.

డిజిటల్ వేదిక‌లు కేవ‌లం త‌మ‌కు గిట్టుబాటు అయ్యే సినిమాల‌ను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నందున గ‌తంలోలాగా ఇప్పుడు కుద‌ర‌దు. ఒక సంవత్సరంలో ఏదైనా OTT ప్లాట్‌ఫారమ్ కోసం నిర్దిష్ట బడ్జెట్ ఉంటుంది. దాని ఆధారంగా వారు సినిమాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటికే ఓటీటీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లు అయిపోయాయని దీంతో సినిమాలను కొనుగోలు చేయడం మానేశారని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కంటెంట్ ఇంప్రెస్ చేస్తేనే కొనుగోళ్ల‌కు డిజిట‌ల్ వేదిక‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిసింది. దీంతో నిర్మాణ దశలో ఉన్న సినిమాలపై ఆ ప్రభావం పడింది. కొన్ని సినిమాలు మ‌ధ్య‌లోనే ఆర్థిక‌ ఆటంకాల‌తో అటకెక్కాయని కూడా తెలిసింది.

ఇదే విషయం గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ మాట్లాడుతూ.. ''ఓటీటీలు పెద్ద కార్పొరేట్‌ సంస్థలు. వారి లెక్కలు వారికి ఉన్నాయి. వారికి ఏం కావాలో వారు నిర్ణయించుకుంటారు. మేము వారిపై నిబంధనలను ఎప్పటికీ నిర్దేశించలేము. అంతా నిర్ణయించేది వారే. వారు మా కంటెంట్‌ను ఇష్టపడి మా వద్దకు వస్తే మేము నిబంధనల గురించి చ‌ర్చింగ‌లం. అలా కానప్పుడు మేం ఏమీ చేయ‌లేం'' అని అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''చిత్రనిర్మాతలు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇక‌పై మెజారిటీ భాగం కంటెంట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఎన్ని సినిమాలు తీసాం అనే దానికంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహమ్మారి సమయంలో మేము నాన్-థియేట్రికల్ డీల్స్ గురించి ఆలోచించాము. కానీ ఇప్పుడు మనం థియేట్రికల్ వసూళ్లను లక్ష్యంగా చేసుకోవాలి'' అని పేర్కొన్నారు.

అగ్ర హీరోలు న‌టించిన పెద్ద సినిమాలకు ఎల్లప్పుడూ మంచి విలువ ఉంటుంది. కానీ OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి మంచి రాబ‌డిని సంపాదించడానికి చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు కంటెంట్ రిచ్‌గా వీక్ష‌కుల‌ను మెప్పించేవిగా ఉండాలి. ఒక విధంగా అంత‌గా విష‌యం లేని చెడ్డ చిత్రాలను పూర్తిగా తిరస్కరించడం వల్ల ఈ సంక్షోభం ప్రేక్షకులకు వరంగా మారుతుంది. ఓటీటీల్లో చెత్త‌ను చూసేందుకు ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం స‌రిపోదు. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో చూడాల్సి ఉంది. చిన్న హీరోలు అద్భుత‌మైన కంటెంట్ ఉన్న సినిమాల్లో న‌టిస్తే అది వారికి వ‌రంగా మారుతుంద‌న్న‌ది కూడా గ్ర‌హించాలి. దానికి అనుగుణంగానే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ కంటెంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఆచితూచి అడుగులు వేయాల‌ని కూడా కొంద‌రు నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారీ కొత్త రూపంలో తిరిగి భార‌త‌దేశంలో అడుగుపెట్టింది. ఇలాంట‌ప్పుడు మ‌రిన్ని చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని కూడా సూచిస్తున్నారు.