Begin typing your search above and press return to search.

థియేటర్ల ఉనికిని దెబ్బతీస్తోన్న‌ అసలు శత్రువు ఎవరు?

ప్రస్తుతం వెండితెర మనుగడ అతి పెద్ద సవాల్ గా మారింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ కు మాత్రమే వెళ్లాల్సి వ‌చ్చేది.

By:  Srikanth Kontham   |   19 April 2026 10:52 AM IST
థియేటర్ల ఉనికిని దెబ్బతీస్తోన్న‌ అసలు శత్రువు ఎవరు?
X

ప్రస్తుతం వెండితెర మనుగడ అతి పెద్ద సవాల్ గా మారింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ కు మాత్రమే వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ నేడు పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రేక్షకులు థియేటర్‌కు రాకుండా ఇంట్లోనే వినోదాన్ని పొందే వెసులుబాటు అంత‌కంత‌కు పెరిగింది. ఈ క్రమంలో థియేటర్ల ఉనికిని దెబ్బతీస్తోన్న‌ అంశాల్లో ప్రధానంగా వినిపిస్తున్నవి రెండే. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయ‌డం ఒక‌టైతే? రెండు సామాన్యుడికి భారంగా మారుతోన్న టికెట్ ధరలు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరమనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న అతి పెద్ద చర్చ.

సినిమా విడుదలైన నాలుగు వారాలకే కొన్నిసార్లు అంతకంటే ముందుగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్ష మవ్వడం థియేటర్లకు పెద్ద దెబ్బగా మారింది. `కొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూడొచ్చు కదా అనే ధోర‌ణి ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది. దీంతో మధ్యస్థ స్థాయి సినిమాలు, కంటెంట్ ఆధారిత చిత్రాలు థియేటర్ల వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. ఓటీటీ విండో పీరియడ్ తగ్గడం వల్ల సినిమాకు ఉండాల్సిన లాంగ్ రన్ కూడా ఉండ‌టం లేదు. దీంతో సినిమా మొదటి వారాంతానికే పరిమితం కావాల్సి వస్తోంది. మరోవైపు అమాంతం పెరిగిన టికెట్ ధరలు థియేటర్లకు వెళ్లే సామాన్య ప్రేక్షకుడి న‌డ్డి విరుస్తున్నాయి.

కేవలం టికెట్ ధరలే కాదు. మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ ఖర్చులు కూడా సామాన్యుడి బడ్జెట్‌ను దాటిపోతున్నాయి. సగటు కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వ‌స్తోంది. దీంతో చాలా మంది భారీ బడ్జెట్ చిత్రాలకు లేదా విజువల్ వండర్స్ అనిపించే సినిమాలకు మాత్రమే థియేటర్లకు వెళ్తున్నారు. మిగిలిన సినిమాలను ఓటీటీలో చూసుకోవడమే ఉత్త‌మంగా భావిస్తున్నారు. మ‌రి ఈ రెండింటిలో ఏది అత్యంత ప్రమాదకరమంటే? పెరిగిన టికెట్ ధరలే ప్రాథమిక అడ్డంకిగా క‌నిపిస్తున్నాయి.

ప్రేక్షకుడు థియేటర్ అనుభవం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ అది తన ఆర్థిక పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే. టికెట్ ధరలు అందుబాటులో ఉంటే చిన్న సినిమాలను కూడా థియేటర్‌లో చూసే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఎప్పుడైతే సినిమా చూడటం అనేది ఖరీదైన వ్యవహారంగా మారుతుందో? అలాంట‌ప్పుడు ప్రేక్షకులు ప్రత్యామ్నాయంగా ఓటీటీ, పైర‌సీ వంటివి ఆశ్రయిస్తున్నారు. అంటే ధరల భారం వల్ల ప్రేక్షకులు ఓటీటీ వైపు మ‌ళ్లుతున్నారు అన్న‌ది కాద‌న‌లేని నిజం.

థియేటర్ల ఉనికిని కాపాడుకోవాలంటే చిత్ర పరిశ్రమ సమతుల్యతను పాటించాలి. టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఓటీటీ విడుదలకు కనీసం 6 నుండి 8 వారాల సమయం ఉండేలా చూడాలి. సినిమా హిట్ అయినా? ప్లాప్ అయినా ఎనిమిది వారాల అనంత‌ర‌మే రిలీజ్ చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆలోపు రిలీజ్ చేయ‌కూడ‌దు. అప్పుడే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుంది. వినోదం అనేది విలాసంగా మారకూడదు. అది అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే కళాకారులకు, థియేటర్ యాజమాన్యాలకు లాభదాయకంగా ఉంటుంది.