ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయా?
కరోనా తరువాత ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల క్రేజ్ తారా స్థాయికి చేరింది. కరోనా భయాల నేపథ్యంలో ప్రేక్షకులని వినోద పరిశ్రమ నుంచి డైవర్ట్ కానివ్వకూడదని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు రంగంలోకి దిగడం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 3:26 PM ISTకరోనా తరువాత ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల క్రేజ్ తారా స్థాయికి చేరింది. కరోనా భయాల నేపథ్యంలో ప్రేక్షకులని వినోద పరిశ్రమ నుంచి డైవర్ట్ కానివ్వ కూడదని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు రంగంలోకి దిగడం తెలిసిందే. ఆ తరువాత చాలా వరకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి ఓటీటీలకు ఎడిక్ట్ అయిపోయారు. దీంతో చాలా వరకు సింగిల్ థియేటర్లు మూతపడటం మొదలైంది. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లపై గత కొంత కాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని, దాని వల్లే నిర్మాతలు తమ సినిమాలని అనుకున్న సమయంలో రిలీజ్ చేయలేకపోతున్నారని, ఓటీటీలు చెప్పిన టైమ్‌లోనే సినిమాలని రిలీజ్ చేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై తాజాగా నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇస్తూ సంచలన విషయాల్ని బయటపెట్టారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి 24 గంటల్లో రాజీనామా చేసి చర్చనీయాంశంగా మారిన ఆయన తాజాగా ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు ఇండస్ట్రీ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లపై ఆధారపడి నడుస్తోందన్నారు. తాను నిర్మించిన తాజా చిత్రం 'కుబేర'. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ 20న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాని ఇప్పుడున్న సిట్యుయేషన్ లో రెండు వారలు టైం తీసుకొని సునీల్ నారంగ్ జూలైలో రిలీజ్ చేయాలని అనుకున్నారట దీనికి ఓటీటీ ప్లాట్ ఫామ్ అంగీకరించలేదట. జూన్ 20న విడుదల చేయాలనే హామీతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందం కుదుర్చుకుందట.
నిర్మాత చెప్పిన దానికి వారు అంగీకరించలేదని, ఒక వేళ తాము చేసుకున్న ఒప్పందాన్ని మీరి జూలైలో రిలీజ్ చేస్తే రూ.10 కోట్లు నష్టపోవాల్సి వస్తుందని సదరు ఓటీటీ వర్గాలు సునీల్ నారంగ్‌కి చెప్పాయట. దీంతో చేసేది లేక జూన్ 20న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంటే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు క్రేజీ సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతలని ప్రభావితం చేస్తున్నాయని 'కుబేర' సంఘటనతో స్పష్టం కావడం ఇండస్ట్రీ వర్గాలని కలవరానికి గురి చేస్తోంది.