ఓటీటీలు కూడా యూట్యూబ్ బాట పట్టేస్తే ఎలా?
యూట్యూబ్ తరహాలో యాడ్స్ వద్దనుకున్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి అదనంగా 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 13 May 2025 2:24 PMరీఛార్జ్ టారీఫ్‌లని ఫ్రీకాల్స్ అంటూ అలవాటు చేసి ఆ తరువాత భారీ స్థాయిలో ఛార్జీలు పెంచేసి ఇప్పుడు మొబైల్ నెట్‌వర్క్ కంపనీలు జనాల నడ్డివిరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో కావడానికి రెడీ అవుతున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇంత వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లేకుండా వీక్షకులని డిస్ట్రబ్ చేయని ఓటీటీలు ఇప్పుడు సినిమా, సిరీస్ మధ్యలో కమర్షియల్ యాడ్స్‌ని చొప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
కరోనా తరువాత ఓటీటీ ప్రభావం మొదలైంది. ఇప్పుడు దాని ప్రభావం పతాక స్థాయికి చేరుకుంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న ఓటీటీలు సిరీస్‌లు, సినిమాలతో సబ్స్‌స్క్రైబర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తూ ప్రతి ఏడాది సబ్స్‌స్క్రైబర్స్‌ని రికార్డు స్థాయిలో పెంచేసుకుంటూ వెళ్లిన ఓటీటీలు ఇప్పుడు యాడ్స్ రూపంలో సబ్స్‌స్క్రైబర్స్ కు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. యూట్యూబ్‌లో సినిమా చూసినా, ఏదైనా వీడియో చూసినా యాడ్ కచ్చితంగా చూడాల్సిందే. స్కిప్ చేయడానికి వీళ్లేదు.
అయితే ఏడాదికి పదిహేను వందలకు పైగా కట్టి సబ్స్‌స్క్రైబ్ చేసుకుంటే వారికి యాడ్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఇక్కడ ఓటీటీ సబ్స్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రం మూవీస్ చూసినా, వెబ్‌సిరీస్‌లు చూసినా యాడ్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. స్కిప్ కొట్టడానికి అవకాశం లేదని, దీనికి సంబంధించి తాజాగా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. అన్ని ఓటీటీల కంటే ముందుగా ఈ పద్దతిని అమెజాన్ ప్రైమ్ వీడియో అమల్లోకి తీసుకురాబోతుందట.
జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్‌ని అనివార్యం చేయబోతున్నారు. యూట్యూబ్ తరహాలో యాడ్స్ వద్దనుకున్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి అదనంగా 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మో అంత కట్టాలా అనుకుంటే మాత్రం కమర్షియల్ యాడ్స్ వీక్షించాల్సిందే. దీనికి సంబంధించిన సమాచారంతో ఇప్పటికే పలువురు సబ్స్‌స్క్రైబర్స్‌కు మెయిల్స్ రావడం మొదలైంది. ఈ పద్దతిని ఇప్పటికే ఆహా ఓటీటీ ఫాలో అవుతుండగా, ఈటీవీ విన్ ప్రోగ్రాం ప్రారంభంలో యాడ్స్‌ని ప్రదర్శిస్తూ వస్తోంది.
అయితే నెట్ ఫ్లిక్స్‌లో మాత్రం ఈ యాడ్స్ గోల లేదు. ప్రీమియం అకౌంట్ కాబట్టి, మధ్యలో యాడ్స్‌వస్తే సబ్స్‌స్క్రైబర్స్ చిరాకు పడి అన్ సబ్స్‌స్క్రైబ్ చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇందులో యాడ్స్ ప్లే చేసే సాహసం చేయలేదు. ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్‌లతో ఓటీటీలు భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా కమర్షియల్స్ యాడ్స్ డీల్‌తో మరిన్ని కోట్లు దండుకోవడానికి తాజాగా తెరలేపడంతో సబ్స్‌స్క్రైబర్స్ ఏంటీ ఖర్మ అని వాపోతున్నారట. ఇదే పద్దతి తారా స్థాయికి చేరితే ఓటీటీల పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయం.