ఓటీటీ భయం..ప్రొడ్యూసర్స్ సీరియస్‌గా తీసుకుంటారా?
టాలీవుడ్‌లో భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల నిర్మాణం జరుగుతున్నా..యావత్ దేశం మొత్తం మన ఇండస్ట్రీ వైపు చూస్తున్నా.. థియేటర్లకు మాత్రం జనం రావడం లేదు.
By: Ravindar Gorantla | 26 Feb 2026 2:55 PM ISTటాలీవుడ్‌లో భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల నిర్మాణం జరుగుతున్నా..యావత్ దేశం మొత్తం మన ఇండస్ట్రీ వైపు చూస్తున్నా.. థియేటర్లకు మాత్రం జనం రావడం లేదు. ఎంత క్రేజీ మూవీ అయినా ప్రేక్షకులు థియేటర్ల తలుపు తట్టడం లేదు. కారణం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు మూడు, నాలుగు వారాళ్లోనే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా కోసం థియేటర్లకు వెళ్లి వేలు ఖర్చు పెట్టుకోవడం కంటె ఓటీటీల్లో చూడటానికి మూడు నాలుగు వారాలు వేచి చూస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చేశారు.
కోవిడ్‌కు ముందు ఓటీటీ అంటే అది మనకు అవసరమా? అనేలా ఉండేది. కోవిడ్ నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు చిన్న సినిమాలకు ప్రధాన బలంగా నిలిచాయి. పెద్ద రేంజ్ సినిమాలకు కూడా ఓటీటీల నుంచి భరోసా లభిస్తుండటంతో మొదట్లో నిర్మాతలకు ఇదొక కామధేనువులా కనిపించింది. అయితే రాను రాను ఇది ఇండస్ట్రీ పాలిట భస్మాసుర హస్తంగా పరిణమించింది. వీటి కారణంగాథియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతం తగ్గింది. నాలుగు వారాలాకే క్రేజీ స్టార్ల సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలోకి వచ్చేస్తుంటే వేలు ఖర్చు పెట్టి సినిమాలు చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.
ఒక్కరు చూసే ఖర్చుతో ఇంటిల్లిపాదీ ఇంట్లో కూర్చుని సినిమా చూసే వీలుండటంతో గతంతో పోలిస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. నిర్మాతలు కూడా తమ డబ్బుని తక్కవ సమయంలో లాగేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ నాలుగు వారాలకే సినిమాలని ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీంతో థియేటర్ వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టాలీవుడ్ మేకర్స్ ఓటీటీలను కట్టడి చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేశారు. గత కొంత కాలంగా ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ వస్తున్నా దానికి సంబంధించిన అగ్రిమెంట్‌ని ఏ నిర్మాతా సీరియల్‌గా తీసుకోవడం లేదు. కొంత మంది నిర్మాతలు తమ అవసరాన్ని బట్టి సినిమాలని మూడు నాలుగు వారాలకే ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రాక సినిమాల థియేట్రిక్ రన్ టైమ్ కిల్ అవుతూ వస్తోంది. అయితే ఓటీటీలు రాను రాను భస్మాసుర హస్తంగా పరిణమిస్తున్న నేపథ్యంలో నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ల సినిమాలే నెల రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో పరిస్థితి చేయిదాటి పోతోందని గమనించిన ప్రొడ్యూసర్స్ ఇకపై బాలీవుడ్ తరహాలో 8 వారాలు దాటాకే సినిమాలని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకోబోతున్నారట. ఈ సందర్భంగా మరో వాదన కూడా వినిపిస్తోంది. 8 వారాల నిబంధన కరెక్టే కానీ కంటెంట్ పరిస్థితేంటనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల మిరాయ్, లిటిల్ హార్స్ట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తాయని తెలిసి కూడా వీడిపై ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. ఈ సినిమాలు కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని నిరూపించాయి. ఆ విషయాన్ని ప్రొడ్యూసర్స్ దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఖచ్చింతగా థియేటర్లకు వస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 8 వారాల నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ సీరియస్‌గా తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.
