OTTల దెబ్బకు సగానికి మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
సినిమా స్క్రీన్లు తగ్గడమే కాదు.. స్క్రీన్ల సైజును కూడా తగ్గించేస్తారని కూడా అంచనాలు వెలువడుతున్నాయి.
By: Tupaki Desk | 20 April 2025 9:00 AM ISTఓటీటీల విజృంభణతో థియేట్రికల్ రంగం తీవ్రంగా నష్టపోతోందని ఒక అంచనా. మునుముందు థియేటర్ల సంఖ్య అమాంతం తగ్గుతుందని తాజాగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. రాబోవు 2 నుంచి 5 ఏళ్లలో మాల్స్ లో మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్య 30 నుంచి 50 శాతానికి తగ్గిపోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.
అయితే దీనికి కారణం అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్ లో ఓటీటీల వీక్షణ. అవసరమైన ఓటీటీ యాప్‌లు ఇప్పుడు ఫోన్ లోనే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఇంట్లోనే చాలామంది సినిమాలు చూస్తున్నారు. వీళ్లంతా లేజీగా మారి థియేటర్ల వరకూ వచ్చేందుకు ఆసక్తిగా లేరని విశ్లేషిస్తున్నారు.
మునుముందు మాల్స్ లో సినిమా స్క్రీన్ల కోత గురించి ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా ఆలోచిస్తోందని, సినిమా థియేటర్ల కంటే, లాభదాయకమైన ఇతర వినోద అవసరాలకు స్పేస్ ను ఇవ్వాలని, ఫుడ్ బిజినెస్, ఇతర ఆకర్షణీయమైన వ్యాపారాల కోసం మాల్స్ లో అధిక స్థలాన్ని కేటాయించాలని ఒత్తిళ్లు పెరిగినట్టు తాజా సర్వే వెల్లడిస్తోంది.
సినిమా స్క్రీన్లు తగ్గడమే కాదు.. స్క్రీన్ల సైజును కూడా తగ్గించేస్తారని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. మరో ఐదేళ్లలో సినిమా స్క్రీన్ల పరిస్థితి దారుణంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెలువడటం నిజంగా ఎగ్జిబిటర్లను కలవరపాటుకు గురి చేస్తోంది.
