సంక్షోభంలో బుల్లితెర.. ఓటీటీ-డిజిటల్‌తో పెరిగిన ముప్పు!
భారతీయ బుల్లితెర రంగం ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంప్రదాయ టీవీ వీక్షకుల సంఖ్య, సబ్‌స్క్రైబర్ల సంఖ్య , ప్రకటనల ఆదాయం రోజురోజుకూ క్షీణిస్తున్నాయి.
By: Sivaji Kontham | 28 May 2026 9:30 AM ISTభారతీయ బుల్లితెర రంగం ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంప్రదాయ టీవీ వీక్షకుల సంఖ్య, సబ్‌స్క్రైబర్ల సంఖ్య , ప్రకటనల ఆదాయం రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున డిజిటల్ వినోద వేదికలు, ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసుల వైపు మళ్లుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. `బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్` (బార్క్) డేటా ఆధారంగా వచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో వారపు టెలివిజన్ రీచ్ ఆర్థిక సంవత్సరం 2024లో 757 మిలియన్లు.. 2025లో 750 మిలియన్లుగా ఉండగా.. ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరానికి అది 741 మిలియన్లకు పడిపోయింది. ఈ నిరంతర క్షీణత టీవీ రంగానికి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
ముఖ్యంగా యువత కేబుల్ - డీటీహెచ్ కనెక్షన్ల కంటే మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టెడ్ టీవీ వ్యవస్థలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాంప్రదాయ టీవీకి కవచంలా భావించే లైవ్ క్రికెట్ టోర్నమెంట్లు, భారీ క్రీడా ఈవెంట్లు సైతం ఈ డిజిటల్ వలసను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. క్రీడల ప్రసారాలకు భారీ ఆడియన్స్ వస్తున్నా.. ప్రేక్షకులు వాటిని టీవీల్లో కాకుండా డిజిటల్ వేదకల్లోనే ఎక్కువగా చూస్తున్నారు. దీని ప్రభావం దేశంలోని అగ్రశ్రేణి మీడియా సంస్థలైన జీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్ లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థల అడ్వర్‌టైజింగ్ ఆదాయం భారీగా తగ్గింది. బ్రాండ్‌లు తమ ప్రకటనల బడ్జెట్‌లను టీవీల నుండి డిజిటల్ క్యాంపెయిన్‌ల వైపు మళ్లిస్తుండటమే ఇందుకు కారణం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త మీడియా దిగ్గజం `జియోస్టార్` సైతం లీనియర్ టెలివిజన్ ప్రకటనల్లో మందగమనాన్ని ఎదుర్కొంది. ఎఫ్‌ఎమ్‌సిజి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి దీనికి కారణాలుగా మారాయి. అయితే ఇంతటి సవాళ్ల నడుమ కూడా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ టీవీ నెట్‌వర్క్‌లను కొంతవరకు ఆదుకుంది. ఆంక్షలు కొన్ని ఉన్నా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అత్యధిక వీక్షణలను నమోదు చేయడమే కాకుండా బ్రాడ్‌కాస్టర్లకు రికార్డు స్థాయి మోనటైజేషన్‌ను తెచ్చిపెట్టింది. లైవ్ స్పోర్ట్స్ కంటెంట్ మాత్రమే ప్రస్తుతం డిజిటల్ వలసకు వ్యతిరేకంగా టెలివిజన్ రంగానికి ఉన్న ఏకైక బలమైన రక్షణగా నిలుస్తోంది.
మరోవైపు, సబ్‌స్క్రైబర్ల నష్టం కూడా పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గణాంకాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ నాటికి 52.78 మిలియన్లుగా ఉన్న యాక్టివ్ పే డీటీహెచ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య, అదే ఏడాది డిసెంబర్ నాటికి 50.99 మిలియన్లకు పడిపోయింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇంత భారీగా కస్టమర్లు తగ్గడం వినియోగదారుల ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు నిదర్శనం. ఫిక్స్‌డ్ మంత్లీ ప్యాకేజీల కంటే తమకు నచ్చిన సమయంలో నచ్చిన కంటెంట్‌ను చూసే ఫ్లెక్సిబిలిటీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఉండటాన్ని వీక్షకులు ఇష్టపడుతున్నారు.
ఈ మారుతున్న సమీకరణాల నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్లు టెలివిజన్‌ను ఒక స్వతంత్ర ప్రసార సాధనంగా కాకుండా.. డిజిటల్ -కనెక్టెడ్ టీవీలతో కూడిన ఒక `హైబ్రిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టమ్`లో భాగంగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
