ఆస్కార్‌లో స్టంట్స్.. RRR స్టిల్... రాజమౌళి ఆనందం
ఆర్‌ఆర్‌ఆర్ స్టిల్‌ను ఆస్కార్ అకాడమీ వినియోగించడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 11 April 2025 10:42 AMసినీ కళాకారులు అంతా జీవితంలో ఒక్కసారి అయినా ఆస్కార్ అవార్డును అందుకోకున్నా కనీసం ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో నిలిచినా చాలు అనుకునే వారు చాలా మంది ఉంటారు. ఆస్కార్ అవార్డ్‌లు దక్కించుకున్న వారు జీవితంలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నట్లే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నట్లే. 100 ఏళ్ల కాలంగా సినిమా ఇండస్ట్రీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన వారికి ఆస్కార్ అవార్డులు ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు మరికొన్ని కేటగిరీల్లో అందించేందుకు గాను అకాడమీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా వంద ఏళ్లుగా ఎదురు చూస్తున్న యాక్షన్ కొరియోగ్రఫర్స్ కల నెరవేర్చే విధంగా స్టంట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డులను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటన వచ్చింది.
ఆస్కార్ అకాడమీ వారు అధికారికంగా ఇకపై స్టంట్స్ విభాగంలోనూ అవార్డ్‌లను ఇవ్వబోతున్నట్లు పేర్కొంటూ మూడు సినిమాలకు సంబంధించిన అద్భుతమైన స్టంట్స్ స్టిల్స్‌ను షేర్ చేశారు. అందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని రామ్ చరణ్ పులి మీదకు దూకే స్టిల్‌ను వినియోగించారు. మొత్తం ఇండియన్ సినిమాకే గర్వకారణంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గత ఏడాది నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఆ సమయంలోనే స్టంట్స్‌కి అవార్డ్ ఉంటే కచ్చితంగా మరో అవార్డ్ సైతం ఆ సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ కి దక్కేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ స్టిల్‌ను ఆస్కార్ అకాడమీ వినియోగించడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. వంద ఏళ్ల సుదీర్ఘ జర్నీలో స్టంట్స్‌కి అవార్డ్ లేకపోవడం అనేది లోటుగా ఉండేది. ఇప్పుడు ఆ లోటు భర్తీ కాబోతుంది. చాలా మంది ఎదురు చూస్తున్న అకాడమీ అవార్డ్ ల్లో స్టంట్స్ కేటగిరీని చేర్చడం ద్వారా సరికొత్త చరిత్ర మొదలు కాబోతుందని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ ప్రకటన కోసం ఆర్‌ఆర్‌ఆర్ స్టిల్‌ను అకాడమీ వినియోగించడంను సైతం రాజమౌళి ప్రస్థావిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు దక్కిన గౌరవం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ప్రారంభం అయిన ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ చకచక జరుగుతోంది. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ పూర్తి అయితే 2027లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎంబి29 సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని, అడ్వంచర్ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది. కనుక ఆస్కార్ లో మొదటి స్టంట్స్ అవార్డ్‌ను రాజమౌళి, మహేష్ బాబు మూవీ దక్కించుకుంటుందేమో చూడాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి కనీసం మూడు నాలుగు కేటగిరీల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యే విధంగా రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.