Begin typing your search above and press return to search.

ఆస్కార్‌కి 2018.. ఈ మూవీకే ఎందుకంత క్రేజ్?

నిజానికి రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పోలిస్తే నిజ‌జీవితాల్ని య‌థాత‌థంగా తెర‌పైకి తేగ‌లిగిన సినిమాల‌కు అవార్డులు ద‌క్క‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే

By:  Tupaki Desk   |   29 Sep 2023 3:54 AM GMT
ఆస్కార్‌కి 2018.. ఈ మూవీకే ఎందుకంత క్రేజ్?
X

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ డ్రామా '2018: ఎవ్రీ వ‌న్ ఈజ్ ఏ హీరో' ఆస్కార్‌కు దేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. లయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. త్వ‌రలో జరగనున్న 96వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడనుంది. ఈ నిర్ణయాన్ని ఎఫ్‌ఎఫ్‌ఐ సెలక్షన్ కమిటీ చైర్మన్, చిత్ర నిర్మాత గిరీష్ కాసరవల్లి చెన్నైలో ప్రకటించారు.

టోవినో థామస్, కుంచాకో బోబన్, ఇంద్రన్స్, ఆసిఫ్ అలీ, తన్వీ రామ్, అపర్ణ బాలమురళి తదితరులు నటించిన ఈ చిత్రం 2018 కేరళలో సంభవించిన వినాశకరమైన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. గ్లోబల్ ఇష్యూతో డీల్ చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యం అంటే సామాన్యులు ఎలాంటి భయాందోళనల‌కు గుర‌వుతారో డీటెయిలింగ్ తో డాక్యుమెంట్ చేయడంతో ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది.

వేణు కున్నపల్లి, సికె పద్మకుమార్, ఆంటో జోసెఫ్‌లు నిర్మించిన ఈ చిత్రానికి అఖిల్ పి ధర్మజన్- జూడ్ ఆంథని రచయితలు. ''దేవుడా నీకు ధన్యవాదములు.. థ్యాంక్యూ ఇండియన్ సినిమా'' అని జూడ్ ఆంథనీ ఈ చిత్రాన్ని ఆస్కార్‌కి భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంచుకున్న వెంటనే ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

2018 వ‌ర్సెస్ బ‌ల‌గం?

నిజానికి రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పోలిస్తే నిజ‌జీవితాల్ని య‌థాత‌థంగా తెర‌పైకి తేగ‌లిగిన సినిమాల‌కు అవార్డులు ద‌క్క‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. మొన్న ప్ర‌క‌టించిన జాతీయ అవార్డుల్లో పుష్ప లాంటి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోను నేచుర‌ల్ పెర్ఫామెన్సెస్.. నిజానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న క‌థాంశం కూడా అవార్డు రావ‌డానికి కార‌ణ‌మైంది. తిరుమ‌ల అడ‌వుల్లో నిరంత‌రం గంధపు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ల అరాచ‌కాల‌పై వార్త‌ల్ని చ‌దివే ప్ర‌జ‌ల‌కు ఇది నేచురాలిటీకి ద‌గ్గ‌ర‌గా అనిపించింది. బ‌హుశా జాతీయ అవార్డుల జూరీకి ఇది బాగా న‌చ్చి ఉండొచ్చ‌ని కూడా విశ్లేషించారు. అలాగే అల్లు అర్జున్ న‌ట‌న రొటీన్ కి భిన్నంగా యూనిక్ స్టైల్ తో అల‌రించింది. అందుకే అత‌డికి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్కింది.

ఇప్పుడు ఆస్కార్ బ‌రిలో పోటీప‌డ‌నున్న భార‌తీయ సినిమాలు 2018 (మ‌ల‌యాళం) - బ‌ల‌గం (తెలుగు) కూడా ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా రూపొందించిన సినిమాలు. నిజ జీవిత‌క‌థ‌లనే ద‌ర్శ‌కులు ఎంతో ఎమోష‌న‌ల్ గా తెర‌పై చూపించ‌డంలో పెద్ద సక్సెస‌య్యారు. న‌టీన‌టుల పెర్ఫామెన్సెస్ కూడా రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. అందుకే ఈ సినిమాలను మేక‌ర్స్ ఆస్కార్ పోటీకి పంపిస్తున్నారు. ఇప్పుడు భార‌త‌దేశం త‌ర‌పున అధికారిక ఎంట్రీల్లో ఈ చిత్రాలు నిల‌వ‌డం సంతోషించ‌ద‌గిన‌ది.