Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఆపెన్ హీమర్

ఈ వారాంతంలో ఇండియాలో వివిధ భాషల్లో చాలానే సినిమాలు రిలీజయ్యాయి.

By:  Tupaki Desk   |   21 July 2023 8:43 AM GMT
మూవీ రివ్యూ : ఆపెన్ హీమర్
X

'ఆపెన్ హీమర్' మూవీ రివ్యూ

నటీనటులు: సిలియన్ మర్ఫీ-రాబర్ట్ డౌనీ జూనియర్-ఎమిలీ బ్లంట్- మ్యాట్ డామన్ తదితరులు

సంగీతం: లుడ్విగ్ గరాన్సన్

ఛాయాగ్రహణం: హొయెట్ వాన్

రచన-దర్శకత్వం-నిర్మాణం: క్రిస్టఫర్ నోలన్


ఈ వారాంతంలో ఇండియాలో వివిధ భాషల్లో చాలానే సినిమాలు రిలీజయ్యాయి. కానీ భారతీయ ప్రేక్షకులు తమ ప్రాంతీయ భాషల్లో రిలీజైన సినిమాల కంటే.. హాలీవుడ్ మూవీ 'ఆపెన్ హేమర్' కోసమే ఎగబడుతున్నారంటే అందుక్కారణం.. అది క్రిస్టఫర్ నోలన్ సినిమా కావడమే. బ్యాట్ మ్యాన్ బిగిన్స్.. ది డార్క్ నైట్.. ఇన్సెప్షన్.. ఇంటర్ స్టెల్లార్.. డన్కిర్క్.. టెనెట్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఉర్రూతలూగించి.. ప్రపంచ సినీ చరిత్రలోనే మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న నోలన్ కు ఇండియాలో.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజే 'ఆపెన్ హీమర్'కు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7-8 గంటల నుంచే షోలు పడేలా.. అవన్నీ ఫుల్ అయ్యేలా చేసింది. మరి ఇంత ఆసక్తి రేకెత్తించిన సినిమాలో ఏముంది..? నోలన్ ఈసారి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేశాడు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పదండి.

'ఆపెన్ హీమర్' ఒక బయోపిక్. ఆటంబాబులు.. హైడ్రోజన్ బాంబుల పితామహుడిగా పేరున్న ఆపెన్ హీమర్ జీవిత కథనే ఇందులో చూపించాడు క్రిస్టఫర్ నోలన్. తక్కువ వయసులోనే అసాధారాణ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న భౌతిక శాస్త్రవేత్త ఆపెన్ హీమర్.. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తర్వాత భౌతిక శాస్త్రంలో అమెరికన్ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్లాడు.. అప్పటిదాకా ఉన్న విస్ఫోటకాలను మించి ఎన్నో రెట్లు ప్రభావం చూపించే హైడ్రోజన్ బాంబును ఎలా తయారు చేశాడు.. ఈ బాంబుకు సంబంధించిన మిషన్లోకి అతను ఎలా వచ్చాడు.. దీన్ని తయారు చేయడంలో తన ఉద్దేశాలంటి.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ప్రభుత్వం ఆ బాంబును ఎలా ఉపయోగించుకుంది.. చివరికి తీరని నష్టం చోటు చేసుకున్నాక ఆపెన్ హీమర్ ప్రభుత్వ పెద్దలు-అధికారులు ఆడిన ఆటలో ఎలా బలిపశువు అయ్యాడు.. ఈ అంశాలన్నింటినీ చర్చించే చిత్రమిది.

నోలన్ సినిమాలకు భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయింది.. ప్రధానంగా రెండు విషయాల్లో. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో అతను ఇచ్చే థ్రిల్.. అలాగే విజువల్ గ్రాండియర్ తో అతను అందించే ప్రత్యేక అనుభూతి. ఇక టేకింగ్ విషయంలో నోలన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 'ఆపెన్ హీమర్' ప్రోమోలు చూసి ఇది కూడా విజువల్ ట్రీట్ ఇచ్చే.. థ్రిల్స్ పంచే సినిమా అని అనుకుంటే.. తప్పులో కాలేసినట్లే. ఆ అంచనాలతోనే సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ చెందాల్సిందే. నోలన్ గత సినిమాల్లో మాదిరి ఇందులో మైండ్ గేమ్స్ ఉండవు. ఉత్కంఠభరిత మలుపులూ ఉండవు. అలాగే విజువల్ గా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సినిమా కూడా కాదిది. ఇది ఒక క్యారెక్టర్ స్టడీతో సాగే డీప్ ఎమోషనల్ డ్రామా. హైడ్రోజన్ బాంబు చుట్టూ తిరిగే సినిమా కాబట్టి.. దాని చుట్టూ ఒక భారీతనాన్ని ఊహించుకున్నా కష్టమే. అసలు నోలన్ ఇందులో ఒక్క విజువల్ ఎఫెక్ట్స్ షాట్ కూడా వాడలేదు అంటేనే.. ఇదెలాంటి సినిమానో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' లాంటి ఇంటెన్స్ బయో డ్రామాలు చూసినపుడు కలిగే ఫీలింగే 'ఆపెన్ హీమర్' చూస్తున్నపుడు కూడా కలుగుతుంది.

'ఆపెన్ హీమర్' చూడాలంటే ముందు చాలా విషయాలు గూగుల్ చేసుకుని థియేటర్లలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ప్రపంచ పరిస్థితులు ఏంటి.. అమెరికాకు ఏ దేశంతో ఎలాంటి సంబంధాలున్నాయి. యుద్ధంలో ఆ దేశం వైపు ఎవరున్నారు.. ఎవరు ప్రత్యర్థులుగా ఉన్నారు.. అసలు అమెరికా ఎందుకు హైడ్రోజన్ బాంబును తయారు చేసింది.. జపాన్ మీదే ఎందుకు ప్రయోగించింది.. ఇలాంటి విషయాలన్నీ కాస్త చదువుకుంటే తప్ప ఈ సినిమాలో ముందు ఇన్వాల్వ్ అవ్వలేం. సినిమాలో ఆపెన్ హీమర్ పాత్రతో కనెక్ట్ కావడానికి చాలా టైమే పడుతుంది. ఈ లోపు అప్పటి ప్రపంచ రాజకీయాలు.. అమెరికన్ రాజకీయ నాయకులు.. బ్యూరోక్రాట్లు.. శాస్త్రవేత్తల మధ్య బోలెడన్ని కాన్వర్జేషన్లు చూడాల్సి ఉంటుంది. చరిత్ర తెలిస్తే తప్ప ఈ కాన్వర్జేషన్లకు కనెక్ట్ కావడం చాలా కష్టం. మనం ఏదో ఊహించుకుంటే ఇక్కడేదో చూపిస్తున్నాడేంటి అనే ఫీలింగే చాలా మందికి కలిగే అవకాశముంది. సగం సినిమా వరకు చాలా బోరింగ్ గా కూడా అనిపిస్తుంది.



ఐతే పై విషయాలేవీ అవగాహన లేకపోయినా.. ఆసక్తికరంగా అనిపించకపోయినా.. నెమ్మదిగా ఆపెన్ హీమర్ పాత్రకు అలవాటు పడటం మొదలయ్యాక ఈ సినిమాకు కూడా కనెక్ట్ అవుతాం. ఆ వ్యక్తి ఎంత స్వచ్ఛమైనవాడో.. తన ఉద్దేశాలేంటో అర్థమయ్యాక దాంతో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ బాంబు తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ.. దాని వల్ల జరిగే నష్టాన్ని ఊహించుకుని సంఘర్షణకు గురయ్యే ఆపెన్ హీమర్ పాత్ర హృదయాన్ని తడుతుంది. ఆ పాత్రలో సిలియన్ మర్ఫీ అద్భుత నటనా కౌశలం కూడా కట్టి పడేస్తుంది. ఆ పాత్ర తాలూకు భావోద్వేగ ప్రయాణమే ఒక దశ దాటాక సినిమాను నడిపిస్తుంది. హైడ్రోజన్ బాంబును పరీక్షించే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సంబంధిత సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఉత్కంఠ రేపుతుంది. బాంబు ప్రయోగాన్ని ఆపడానికి ఆపెన్ హీమర్ చేసే ప్రయత్నం.. పరిస్థిత తన చేయి దాటిపోతున్నపుడు పైకి మామూలుగా కనిపిస్తూ లోలోన తీవ్ర సంఘర్షణకు లోనయ్యే క్రమం.. అందరూ కలిసి తనను బలిపశువును చేస్తున్నారని అర్థమైనపుడు ట్రయల్ రూంలో తన నిస్సహాయత చూపించే విధానం.. ఇవన్నీ కూడా 'ఆపెన్ హీమర్'ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి.

హాలీవుడ్ సినిమాలంటే కేవలం విజువల్ వండర్స్ అనే కాక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాలను కూడా ఇష్టపడేవారికైతే 'ఆపెన్ హీమర్' బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సినిమాలను అర్థం చేసుకోవడానికి.. ఆస్వాదించడానికి వేరే రకమైన అభిరుచి ఉండాలి. నోలన్ ఈసారి తన మార్కు మలుపులు.. విజువల్ అప్పీల్ మీద కాకుండా.. ఒక క్యారెక్టర్ స్టడీతో ఇంటెన్స్ ఎమోషనల్ జర్నీని చూపించే ప్రయత్నం చేశాడు. నోలన్ అభిమానులు ఆయన్నుంచి ఆశించే అంశాలు ఇందులో లేవు కానీ.. దర్శకుడిగా ఆయన స్థాయి మాత్రం ఏమీ తగ్గిపోలేదు. ఆయన పనితనాన్ని చాటే అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. నోలన్ కెరీర్లో ముందు వరుసలో ఉండే సినిమాల్లో 'ఆపెన్ హీమర్' ఒకటిగా నిలుస్తుంది. కమర్షియల్ సక్సెస్ సంగతేమో కానీ.. ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడం ఖాయం. సిలియన్ మర్ఫీ నటనకు ఆస్కార్ అవార్డు కూడా రావచ్చు. ఐరన్ మ్యాన్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చిన రాబర్ట్ బ్రౌనీ జూనియర్ ఇందులో ఇచ్చిన పెర్ఫామెన్స్ కూడా స్టాండౌట్ గా నిలుస్తుంది. మిగతా నటీనటులందరూ కూడా బాగా చేశారు. సాంకేతిక పరంగా.. ముఖ్యంగా సంగీతం విషయంలో 'ఆపెన్ హీమర్' అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది.


చివరగా: ఆపెన్ హీమర్.. డీప్ ఎమోషనల్ జర్నీ


రేటింగ్ - 3/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater