Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఆల్ ఖాన్స్ ఎందుకు స్పందించడం లేదు యుద్ధం మీద?

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 May 2025 9:00 AM IST
బాలీవుడ్  ఆల్  ఖాన్స్  ఎందుకు స్పందించడం లేదు యుద్ధం మీద?
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఉగ్రమూకలకు, వారి వెనుక ఉన్న వారికి గట్టి బుద్ది చెప్పారని కొనియాడారు. దీనిపై పలువురు క్రీడాకారులు, సినీ నటులు, నేతలు అంతా ఆన్ లైన్ వేదికగా స్పందించారు. అయితే... బాలీవుడ్ 'ఖాన్స్' నుంచి మాత్రం రియాక్షన్ రాలేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. అతి చిన్న వ్యక్తి నుంచి అంబానీ వరకూ.. పామరుడి నుంచి పండితుడి వరకూ.. విద్యార్థుల నుంచి అధికారుల వరకూ.. అంతా ఈ విషయంపై ఎవరి స్థాయిలో వారు.. వారి వారి వేదికలపై స్పందించారు. ఆపరేషన్ సిందూరు భారత్ ప్రిస్టెజ్ అని పొంగిపోయారు. పాకిస్థాన్ లో ఉన్న చివరి ఉగ్రవాదిని చంపేవరకూ ఆపరేషన్ సాగాలని కాంక్షించారు.

అయితే... బాలీవుడ్ లోని స్టార్ ఖాన్ లు మాత్రం ఈ ఆపరేషన్ పైనా, తదనంతర పరిణామాలపైనా స్పందించకపోవడం గమనార్హం. దేశం వారికి ఎంతో ఇచ్చింది.. దేశంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా ఆదరించారు.. ఫలితంగా వారు ఈ స్థాయిలో ఉన్నారు నేడు! ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. దీనిపై సగటు భారతీయుడు హర్ట్ అయ్యాడనే చర్చా జరిగింది!

కాల్పుల విరమణకు భారత్ అంగీకరించి ఉండకపోతే.. పాక్ లో నక్కిన ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న దేశం లెక్క సరిగ్గా సరిపెట్టేవారని.. ఇకపై పక్కలో బలెం సమస్య మనకు ఉండేది కాదని అనుకున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ ఖాన్స్ లో ఒకరు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు.. నెటిజన్ల వాయింపు మొదలయ్యేసరికి డిలీట్ చేశారు.

ఇందులో భాగంగా... భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో.. నెట్టింట ఒక్కసారిగా అగ్రహజ్వాలలు అలుముకున్నాయి. ఈ క్రమంలో సీజ్ ఫైర్ కి అంగీకరించిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు! దీంతో.. సలామ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.

ఈ సందర్భంగా... ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఎందుకు స్పందించలేదని.. ఇన్ని రోజులు ఎందుకు సైలంట్ గా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ పై స్పందించకుండా.. కాల్పుల విరమణపై స్పందించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా... సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

అయితే... మరికొందరు మాత్రం... కేంద్రం ప్రభుత్వం అంగీకరించిన సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థాంక్స్ చెప్పాడని.. పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ డిలీట్ చేసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... ఆపరేషన్ సిందూర్ పై బాలీవుడ్ బడా ఖాన్స్ మౌనం కొత్త చర్చకు దారి తీసిందనే చర్చ మాత్రం మొదలైందని అంటున్నారు!

కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన సల్మాన్... "భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది.. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. నా హృదయం వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తుంది.. ఒక అమాయకుడి చంపడం అంటే అది మొత్తం ప్రపంచాన్ని చంపడంతో సమానం" అని పోస్ట్ చేశారు.