Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఊరు పేరు భైరవకోన

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:18 AM GMT
మూవీ రివ్యూ : ఊరు పేరు భైరవకోన
X

'ఊరు పేరు భైరవకోన' మూవీ రివ్యూ

నటీనటులు: సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ-కావ్య థాపర్-వడివుక్కరసు-రవిశంకర్-హర్ష చెముడు-జయప్రకాష్-మీమ్ గోపి తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

ఛాయాగ్రహణం: రాజ్ తోట

మాటలు: భాను-నందు

నిర్మాత: రాజేష్ దండ

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీఐ ఆనంద్

ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. తనకు 'టైగర్' లాంటి హిట్ ఇచ్చిన వీఐ ఆనంద్‌ తో కలిసి చేసిన కొత్త సినిమా.. ఊరు పేరు భైరవకోన. విడుదలకు ముందే మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

బసవ (సందీప్ కిషన్) సినిమాల్లో ఫైటర్‌ గా పని చేసే కుర్రాడు. అతను ఒక పెళ్లి ఇంట్లోకి చొరబడి పెళ్లి కూతురి కోసం చేయించిన నగలన్నీ దోచుకుని వెళ్లిపోతాడు. వాటి విలువ నాలుగు కోట్లు. తన స్నేహితుడితో కలిసి ఆ నగలు తీసుకుని పారిపోతున్న అతడిని హైవేలో మనుషులను దోచుకునే గీత (కావ్య థాపర్) యాక్సిడెంట్ పేరుతో ట్రాప్ చేస్తుంది. ఈ ముగ్గురూ కలిసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ప్రవేశిస్తారు. అక్కడికి వెళ్లాక ఈ ముగ్గురికీ అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ల కారు.. నగలు మాయం అవుతాయి. వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ క్రమంలోనే ఆ ఊరి గురించి సంచలన విషయాలు తెలుస్తాయి బసవకు. ఇంతకీ ఆ ఊరి కథేంటి.. బవస అసలు ఆ దొంగతనం ఎందుకు చేశాడు.. ఆ ఊరికి అతడికి ఉన్న కనెక్షన్ ఏంటి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

కొన్ని సినిమాలు ఓపెన్ మైండ్ తో చూస్తే ఒకలా అనిపిస్తాయి. అవే సినిమాలను ముందస్తు అంచనాలతో చూస్తే ఇంకోలా అనిపిస్తాయి. కాంబినేషన్ క్రేజ్.. దర్శకుడి నేపథ్యం.. సినిమా గురించి చిత్ర బృందం చెప్పే మాటలు.. ప్రోమోల్లో చూపించిన అంశాలు.. బాగా అంచనాలు పెంచేశాక వచ్చి థియేటర్లలో కూర్చుంటే.. ప్రేక్షకుల దృష్టికోణమే వేరుగా ఉంటుంది. ప్రతిదీ ఒక అద్భుతంలా ఉండాలని ఆశిస్తారు. పనిగట్టుకుని పెంచిన అంచనాలు తొలి రోజు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఉపయోగపడతాయి కానీ.. కంటెంట్ సాధారణంగా అనిపిస్తే ఆ ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు.

'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ఉన్న సమస్య ఇదే. ఈ సినిమా గురించి ఏమీ తెలియకుండా వెళ్లి థియేటర్లలో కూర్చుంటే ఇందులోని కొన్ని అంశాలు థ్రిల్ కలిగిస్తాయి. కొన్ని సీన్లు నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ 'టైగర్' కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత వీఐ ఆనంద్ అదే ఫాంటసీ థ్రిల్లర్ జానర్లో రూపొందించిన సినిమా.. దీర్ఘ కాల మేకింగ్.. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం.. గరుడపురాణంతో ముడిపడ్డ కథ గురించి ట్రైలర్లో హింట్.. విడుదలకు రెండు రోజుల ముందే ప్రిమియర్స్ వేయడంలో మేకర్స్ చూపించిన కాన్ఫిడెన్స్.. ఈ అంశాలన్నీ సినిమా మీద అంచనాలు భారీగా పెంచాయి. ఆ అంచనాలతో ఎంతో ఊహించుకుని థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు తెర మీద చూపించిన విషయాల్లో 'అద్భుతం'లా ఏదీ కనిపించదు.

తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫార్మాట్ నే అనుసరించాడు 'ఊరు పేరు భైరవకోన' కోసం వీఐ ఆనంద్. ఫాంటసీ అంశాలతో ముడిపడ్డ అతడి కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. కథలో చాలా మలుపులూ కనిపిస్తాయి. కానీ ఫాంటసీ అంశాలను తెర మీద వావ్ అనిపించేలా చూపించడంలో.. మలుపులను ఉత్కంఠభరితంగా ప్రెజెంట్ చేయడంలో ఆనంద్ విఫలమయ్యాడు. ట్రైలర్ చూస్తే వచ్చిన 'హై' సినిమా చూస్తే కలగదు. భైరవకోన అంటూ ఆనంద్ సృష్టించిన ఒక ప్రపంచం చూస్తే.. ఏదో ఒక అసహజమైన ఫీలింగ్ కలుగుతుంది. ఫాంటసీ సినిమా అంటే లాజిక్స్ ఉండవన్న మాట వాస్తవమే కానీ.. తెరపై చూస్తున్న అంశాలు కన్విన్సింగ్ గా అనిపించడం ముఖ్యం. 'ఊరు పేరు భైరవకోన'లో మాత్రం ఏదో ఒక కృత్రిమమైన ప్రపంచాన్ని చూస్తున్న భావన కలిగి.. తెరపై కనిపించే విషయాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. భైరవకోన అనే ఊరికి సంబంధించిన గుట్టు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించినా.. ఆ ప్రపంచమంతా అసహజంగా అనిపించడం మైనస్ అయింది.

'ఊరు పేరు భైరవకోన'కు సంబంధించి ప్లస్ పాయింట్.. కామెడీ. ఒక ట్విస్టుతో ముడిపడ్డ వెన్నెల కిషోర్ పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. అలాగే వైవా హర్ష క్యారెక్టర్ కూాడా బాగానే వర్కవుట్ అయింది. కిషోర్ పాత్రలో మరో కోణం బయటపడ్డాక దాంతో కామెడీని బాగా పండించాడు దర్శకుడు. దయ్యాలను మోసం చేద్దామనే ఆలోచనతో హీరో అండ్ కో వాటి కోటలోకి ప్రవేశించి డ్రామా ఆడే ఎపిసోడ్ 'ఊరు పేరు..'లో స్టాండౌట్ గా నిలుస్తుంది. దానికంటే ముందు భైరవకోనకు సంబంధించిన ట్విస్ట్ రివీలయ్యే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగానే అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల వల్ల విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం అటు ఇటుగా అనిపించినా.. ఆయా ఎపిసోడ్లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. గరుడ పురాణం.. మిస్సయిన నాలుగు పేజీలు అంటూ ఏదో పెద్ద కాన్సెప్ట్ చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. ఆ తర్వాత అదేమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. ఈ కథ పరిధి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ పాత్ర కథలో కీలకమే కానీ.. గూడెం చుట్టూ నడిపిన కథలో ఎమోషన్ అంతగా వర్కవుట్ కాలేదు.

హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ చాలా సాధారణంగా అనిపిస్తుంది. అందులో ఫీల్.. ఎమోషన్ లేకపోవడమే 'ఊరు పేరు..'కు పెద్ద ప్రతికూలతగా మారింది. క్లైమాక్స్ ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. చివరగా మనం ఊహించుకున్న దానికి.. తెర మీద చూసిన దానికి పొంతన అయితే కుదరదు. కథలోని ట్విస్టులతో అక్కడక్కడా కొంచెం థ్రిల్ ఫీలవుతాం. కామెడీ సీన్లు కొంత నవ్విస్తాయి. అంతకుమించి విశేషంగా చెప్పుకునే అంశాలు 'ఊరు పేరు భైరవకోన'లో పెద్దగా లేవు.

నటీనటులు:

సందీప్ కిషన్ బసవలింగం పాత్రలో యాప్ట్ అనిపిస్తాడు. అతడి నటన పాత్రకు తగ్గట్లుగా బాగానే సాగింది. హీరోలా కాకుండా ఒక సగటు కుర్రాడిలా కనిపిస్తాడు సందీప్. పెర్ఫామెన్స్ అదరహో అనిపించే స్థాయిలో సినిమాలో సన్నివేశాలు లేవు. ఎమోషనల్ సీన్లలో సందీప్ మెప్పించాడు. తన పాత్ర అంత గొప్పగా ఏమీ అనిపించదు. వర్ష బొల్లమ్మ కథలో అత్యంత కీలకమైన పాత్రలో రాణించింది. తన నటనకు ఎలాంటి వంకలు పెట్టలేం. మరో హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ విందు చేసింది. ఇప్పటిదాకా తెలుగులో చేసిన సినిమాల్లో ఆమె అత్యంత ఆకర్షణీయంగా కనిపించిన సినిమా ఇదే. ఐతే తన పాత్ర సినిమాలో చాలా అసహజంగా అనిపిస్తుంది. రవిశంకర్ తక్కువ సన్నివేశాల్లోనే తనదైన ముద్ర వేశాడు. వెన్నెల కిషోర్ పక్కా పైసా వసూల్ పాత్ర చేశాడు. అతను బాగా నవ్వించాడు. హర్ష చెముడు కూడా బాగా చేాశాడు. సీనియర్ నటి వడివుక్కరసు అప్పీయిరెన్స్ బాగుంది కానీ.. తన పాత్ర మొదట్లో ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు లేదు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'ఊరు పేరు భైరవకోన' మంచి స్థాయిలోనే కనిపిస్తుంది. శేఖర్ చంద్ర మంచి పాటలిచ్చాడు. నిజమే నే చెబుతున్నా.. హమ్మ హమ్మ పాటలు ఆడియోలోనే కాదు.. తెర మీదా బాగున్నాయి. శేఖర్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. రాజ్ తోట ఛాయాగ్రహణం ఓకే. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాకు పెట్టిన బడ్జెట్ కోణంలో చూస్తే మంచి ఔట్ పుటే కానీ.. ఇప్పుడున్న ప్రమాణాల్లో చూస్తే తక్కువగానే అనిపిస్తాయి. దర్శకుడు వీఐ ఆనంద్ స్క్రిప్టు విషయంలో కష్టపడ్డ విషయం అర్థమవుతుంది కానీ.. తెరపై అది సరిగ్గా తర్జుమా కాలేదనిపిస్తుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' స్థాయిలో అతను ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయలేకపోయాడు. కథను బిగితో నడిపించలేకపోయాడు. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: ఊరు పేరు భైరవకోన.. కొంచెం థ్రిల్ కొన్ని నవ్వులు

రేటింగ్ - 2.5/5