Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఓం భీం బుష్

By:  Tupaki Desk   |   22 March 2024 5:38 AM GMT
మూవీ రివ్యూ : ఓం భీం బుష్
X

'ఓం భీం బుష్' మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు- ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ- ప్రీతి ముకుందన్-ఆయేషా ఖాన్- శ్రీకాంత్ అయ్యంగార్- ఆదిత్య మేనన్- రచ్చ రవి తదితరులు

సంగీతం: సన్నీ ఎంఆర్

ఛాయాగ్రహణం: రాజ్ తోట

నిర్మాణం: వి సెల్యులాయిడ్- సునీల్ బలుసు

రచన-దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

టాలీవుడ్ బాక్సాఫీస్‌ లో వేసవి వినోదానికి తెరతీయడానికి వచ్చింది 'ఓం భీం బుష్' సినిమా. శ్రీ విష్ణు.. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి రూపొందించిన చిత్రమిది. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: కృష్ణకాంత్ (శ్రీ విష్ణు).. వినయ్ (ప్రియదర్శి).. మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ఒక ప్రొఫెసర్ దగ్గర పీహెచ్డీ స్టూడెంట్లుగా చేరి.. ఆయన్ని నానా తిప్పలు పెట్టి డాక్టరేట్లు సంపాదించిన యువ శాస్త్రవేత్తలు. వీళ్ల బాధ భరించలేక కోరుకున్నదానికంటే ముందే డాక్టరేట్లు ఇప్పించి యూనివర్శటీ నుంచి బయటికి పంపించేస్తాడు ప్రొఫెసర్. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ ముగ్గురూ భైరవపురం అనే ఊరు చేరుకుని అక్కడ సకల సమస్యలకూ తమ దగ్గర పరిష్కారం ఉందంటూ ఒక దుకాణం తెరుస్తారు. నిజంగానే ఆ ఊరి వాళ్ల ఇబ్బందులు తీర్చి కొన్ని రోజుల్లోనే మంచి పేరు సంపాదిస్తారు. ఇది గిట్టని ఆ ప్రాంత భూత వైద్యుడు.. ఆ ఊరిని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సంపంగి అనే దయ్యం ఉన్న కోటలోకి వెళ్లి నిధిని బయటికి తీసుకురావాలని సవాలు విసురుతాడు. నిధిలో వాటాకు తోడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా దక్కుతుందని ఈ సవాలును స్వీకరించి తన మిత్రులతో కలిసి కోటలో అడుగు పెడతాడు కృష్ణకాంత్. అక్కడ వీరికి ఎదురైన అనుభవాలేంటి.. ఇంతకీ సంపంగి దయ్యం కథేంటి.. దాన్ని వాళ్లా నిధిని దక్కించుకోగలిగారా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ: ఓం భీమ్ బుష్.. ఈ మాట వినగానే పెదాలపై ఒక చిరునవ్వు వస్తుంది. చిన్నతనంలో సరదాగా ప్రతి ఒక్కరూ ఈ మాట అని ఉంటారు.. లేదా విని ఉంటారు. ఇలాంటి తమాషా టైటిల్ పెట్టడమే కాదు.. ''నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్'' అనే ఉపశీర్షిక జోడించి ఒక క్రేజీ రైడ్ కు రెడీగా ఉండమని సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు శ్రీ హర్ష. మ్యాజిక్ తప్ప లాజిక్ ఉండదని చెప్పడం ద్వారా స్క్రిప్టు రాయడంలో కానీ.. సినిమా తీయడంలోనూ ఏ హద్దులూ.. పద్ధతులూ పెట్టుకోలేదు. ఇందులో హీరోలు ఏమనుకుంటే అది చేస్తారు.. వాళ్లు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. దయ్యం పడితే వదిలించేస్తారు.. సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటే పెంచేస్తారు.. ఇంకా రకరకాల పనులు చేసేస్తారు. సినిమా మొదలైన దగ్గర్నుంచి లాజిక్ అనే మాట కొండెక్కేస్తుంది. ప్రతి చోటా ఇదేంటి ఈ పాత్రలు ఇలా ప్రవర్తిస్తున్నాయి.. కథేంటి ఒక పద్ధతంటూ లేకుండా ఎలా పడితే అలా సాగిపోతోంది..? సైంటిస్టులేంటి దయ్యాలు వదలగొట్టడమేంటి..? దయ్యంతో సరసమేంటి..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా..? ఇలా అడుగడుగునా లాజికల్ ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ముందే డిస్క్లైమర్ వేసేశారు కదా.. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని. దానికి సర్దుకుపోతే 'ఓం భీం బుష్'ను ఏ బాదరబందీ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అలా కాని పక్షంలో ఆరంభంలోనే బ్రేకులు పడిపోతాయి. 'ఓం భీం బుష్' ఒక నాన్సెన్స్ కూడా అనిపించొచ్చు.

ప్రధాన పాత్రధారులు ఎంత డంబ్ అయితే అంత బాగా వినోదం పండుతుందని నమ్ముతున్నారు ఈ తరం దర్శకులు. 'జాతిరత్నాలు'తో ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. 'ఓం భీం బుష్' కూడా దాదాపుగా 'జాతిరత్నాలు'ను తలపించే సినిమానే. ముగ్గురు హీరోలు ఒకరిని మించి ఒకరు డంబ్ గా ఉంటూ.. అల్లరల్లరి చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతారు. సోషల్ మీడియాను కాచి వడపోసేసినట్లుగా దర్శకుడు హర్ష.. అక్కడ కనిపించే పాపులర్ మీమ్స్ అన్నింటినీ ఉపయోగించుకుంటూ క్రేజీ డైలాగ్స్ రాశాడు. కాదేదీ జోకులకు అనర్హం అన్నట్లు చివరికి ఈ చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తీసిన డిజాస్టర్ మూవీ 'ఆదిపురుష్' మీద కూడా పంచులు వేసేశాడు. సెన్స్ లెస్ గా సాగే సీన్లు.. డైలాగులు.. ఆ రకమైన వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. కథ ఒక పద్ధతంటూ లేకుండా సాగినా ప్రతి సీన్లూ వినోదానికి అయితే ఢోకా ఉండదు. ఇక అడల్ట్ డోస్ ఉన్న డైలాగులు.. సీన్లను ఇష్టపడేవారికైతే 'ఓం భీం బుష్' ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈ డోస్ మరీ ఎక్కువైపోయి కొంచెం ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. అక్కడ సర్దుకోవాలి.

ప్రథమార్ధంలో వేర్వేరు లొకేషన్లలో.. బోలెడన్ని పాత్రల మధ్య హీరోలు చేసే విన్యాసాలతో వినోదాత్మకంగా సాగుతూ 'ఓం భీం బుష్' పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ వరకు సెటప్ అంతా కొంచెం భిన్నంగా నడుస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో దయ్యం కోటలోకి హీరోలు అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఒక సగటు హార్రర్ కామెడీ మూవీ చూస్తున్నట్లే అనిపిస్తుంది. కోటలో ముగ్గురూ భయపడుతూ భయపడుతూ తాము కోరుకున్న దాని కోసం వెతకడం.. వారిని దయ్యం వెంటాడుతూ భయపెట్టడం.. ఈ క్రమంలో రొటీన్ అయినప్పటికీ కామెడీ వర్కవుట్ అయింది. కాకపోతే రిపీటెడ్ గా అనిపించే సన్నివేశాలు ఒక దశ దాటాక బోర్ కొట్టిస్తాయి. దయ్యం బ్యాక్ స్టోరీ మాత్రం వెరైటీగా అనిపిస్తుంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత మళ్లీ ఈ సినిమాలో దయ్యాన్ని డిఫరెంట్ కోణంలో చూస్తాం. దయ్యాన్ని చూసి భయం పోయి సానుభూతి కలిగేలా ఆ పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు. దయ్యం కోసం హీరో తీసుకునే నిర్ణయం కూడా క్రేజీగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా లాజిక్ కంటే మ్యాజిక్ గురించే ఆలోచించాడు దర్శకుడు. ముగింపు సన్నివేశాలు కూడా మంచి వినోదాన్నే అందిస్తాయి. ఓవరాల్ గా 'ఓం భీం బుష్' ఆరంభం నుంచి చివరి వరకు లాజిక్స్ తో సంబంధం లేకుండా ఫన్నీ ఎంటర్టైనర్. అడల్ట్ డోస్ కొంచెం హద్దులు దాటిన నేపథ్యంలో ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది పడొచ్చు. కానీ యూత్ కు మాత్రం ఈ సినిమా ఒక క్రేజీ రైడే.

నటీనటులు: కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మూడీగా ఉండే క్యారెక్టర్లు చేసిన శ్రీవిష్ణు.. ఇప్పుడు అల్లరి పాత్రల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. తనకంటూ ఒక కామెడీ టైమింగ్ డెవలప్ చేసుకుని ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. 'ఓం భీం బుష్'లో చేసిన కృష్ణకాంత్ క్యారెక్టర్.. తన కెరీర్లోనే ఫన్నీయెస్ట్ అని చెప్పొచ్చు. ''ఐయామ్ క్రిష్.. అమ్మాయిల మనసులను చేస్తా ఫిష్'' అంటూ టిపికల్ డైలాగ్ డెలివరీతో అతను చెప్పే డైలాగులు మంచి వినోదం పంచుతాయి. దయ్యంతో సరసాలాడే సీన్లలో శ్రీ విష్ణు భలే చేశాడు. సినిమా అంతా నవ్విస్తూ చివర్లో కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు శ్రీ విష్ణు. ఇక 'జాతి రత్నాలు' తరహాలోనే హీరో పక్కనే ఉంటూ బోలెడంత వినోదం పంచారు ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ. ఇద్దరిలో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. ఒకరితో ఒకరు పోటీ పడి అల్లరి చేశారు. నవ్వించారు. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించిన కాసేపు ఆకట్టుకున్నాడు. రచ్చ రవి కూడా బాగా చేశాడు. ఆదిత్య మేనన్ పాత్ర కనిపించిన కాసేపు ఓకే అనిపిస్తుంది. హీరోయిన్లలో ప్రీతి ముకుందన్ చూడ్డానికి బాగుంది. తనకు పెద్దగా నటించే అవకాశం రాలేదు. చేపల కొట్టు అమ్మాయిగా ఆయేషా ఖాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం: 'స్వామి రారా' సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్ చాన్నాళ్ల తర్వాత తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. తన పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్లుగా క్రేజీగా సాగింది. ఆర్ఆర్ మంచి హుషారు పుట్టిస్తుంది. రాజ్ తోట ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ డిజైన్.. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో బాగానే కుదిరాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ హర్ష.. 'రౌడీ బాయ్స్' తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చాడు. తన తొలి చిత్రం 'హుషారు'ను మించిన క్రేజీ రైడ్ అందించాడు. అతను ప్రధాన పాత్రలను యువ ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దుకున్నాడు. ఇక తన డైలాగ్స్ అంతా కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ చుట్టూనే తిరిగాయి. కథ.. పాత్రలు.. డైలాగుల విషయంలో అతనేమీ హద్దులు పెట్టుకోలేదు. ఒక పద్ధతీ పాడూ లేకుండా రాసేశాడు. తీసేశాడు. ఐతే అదే ఈ సినిమా క్రేజీగా మారడానికి కారణమైంది. అన్నిసార్లూ ఇలా కుదరకపోవచ్చు కానీ.. 'ఓం భీం బుష్' వరకు వర్కవుట్ అయింది.

చివరగా: ఓం భీం బుష్.. అల్లరే అల్లరి

రేటింగ్- 2.75/5