Begin typing your search above and press return to search.

మొండిగా రీమేక్ కోసం ముందుకెళితే రిస్క్ త‌ప్ప‌దా?

ఇప్ప‌డు 'ఓ మై గాడ్ 2'ని అదే ఇద్ద‌రితో రీమేక్ చేయ‌డం కుద‌ర‌ని ప‌ని. చేయ‌డానికి వారు ఆస‌క్తిని చూపించ‌రు కూడా. కార‌ణం శివుడి పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌క పోవ‌చ్చు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 12:30 PM GMT
మొండిగా రీమేక్ కోసం ముందుకెళితే రిస్క్ త‌ప్ప‌దా?
X

కొన్ని రీమేక్‌లు చేయాలి..అలా చేయ‌డం చాలా అవ‌స‌రం కూడా. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రీమేక్‌లు చేయ‌డం రిస్కే. పాన్ ఇండియా సినిమాల హ‌వా, ఓటీటీల ప్ర‌భావం కార‌ణంగా ప్ర‌తి భాష‌కు సంబంధించిన సినిమా ఓటీటీల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చేస్తోంది. దీంతో మునుప‌టిలా రీమేక్‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. ఒక వేళ అలా కాద‌ని రీమేక్‌లు చేసిన వాళ్లు చేతులు కాల్చుకున్న సంద‌ర్భాలు ఇటీవ‌ల చాలానే చూశాం. ప‌ట్టుబ‌ట్టి చిరుతో రీమేక్ చేసిన 'గాడ్ ఫాద‌ర్‌' సోసో అనిపించుకుంది.

ఇక మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన 'భోళా శంక‌ర్‌' ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి చేసిన 'బ్రో' కూడా అంతంత మాత్ర‌మే అనిపించింది. దీంతో రీమేక్‌లు చేయాలంటేనే హీరోలే కాకుండా నిర్మాత‌లు కూడా భ‌య‌ప‌డుతున్నారు. కానీ కొంత మంది ప్రొడ్యూస‌ర్‌లు మాత్రం రిస్క్ చేయ‌డానికి తొంద‌ర ప‌డిపోతున్నారు. రిస్క్ అయినా స‌రే చేతులు కాల్చుకోవ‌డానికి పోటీప‌డుతున్నారు.

తెలుగులో అది వ‌ర్క‌వుట్ కాద‌ని తెలిసిన తెలిసి తెలిసి చేతులు కాల్చుకోవ‌డానికి రెడీ అయిపోతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్‌లో అక్ష‌య్ కుమార్, పంక‌జ్ త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌లిసి న‌టించిన చిత్రం 'ఓ మై గాడ్ 2'. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా ఎన్నో అవాంత‌రాల్ని, వివాదాల్ని అధిగ‌మించి ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సెన్సార్ ప‌ర‌మైన ఇబ్బందుల‌తో పాటు కంటెంట్ ప‌ర‌మంగా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొని ఫైన‌ల్‌గా హిట్ అనిపించుకుంది.

అయితే ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని కొంత మంది నిర్మాత‌లు హ‌క్కుల కోసం పోటీప‌డుతున్నారు. శివుడి పాత్ర‌కు, శృంగార ఆలోచ‌న‌ల‌తో ఉన్న ఓ యువ‌కుడి చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. ఇలాంటి సున్నిత‌మైన అంశం నేప‌థ్యంలో సాగే సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డం అంటే క‌త్తిమీది సాము అన‌డం కంటే రిస్క్ అన‌డం క‌రెక్ట్. తెలుగులో ఇలాంటి క‌థ‌ని ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌రు. ఆ విష‌యం తెలిసి కూడా ప‌లువురు నిర్మాత‌లు రైట్స్‌కోసం పోటీప‌డ‌టం అర్థం లేని విష‌యం. గ‌తంలో 'ఓ మై గాడ్‌' సినిమాని తెలుగులో 'గోపాల గోపాల‌' పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, విక్ట‌రీ వెంక‌టేష్‌ల‌తో రీమేక్ చేశారు.

ఇప్ప‌డు 'ఓ మై గాడ్ 2'ని అదే ఇద్ద‌రితో రీమేక్ చేయ‌డం కుద‌ర‌ని ప‌ని. చేయ‌డానికి వారు ఆస‌క్తిని చూపించ‌రు కూడా. కార‌ణం శివుడి పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌క పోవ‌చ్చు. ఇటీవ‌ల 'బ్రో'లో టైమ్ దేవుడిగా క‌నిపిస్తే ఆ సినిమా సోసో అనిపించుకుంది. మ‌ళ్లీ దేవుడిగా అంటే ప‌వ‌న్ ఆస‌క్తిని చూపించే ఆవ‌కాశం లేదు. ఇక పంక‌జ్ త్రిపాఠి పాత్ర‌లో వెంకీ న‌టిస్తారా? అంటే అదీ క‌ష్ట‌మే. పైగా శృంగార ఆలోచ‌న‌ల‌తో సాగే క‌థాంశంని మ‌న వాళ్లు డైజెస్ట్ చేసుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని ఏ ధైర్యంతో తెలుగు నిర్మాత‌లు పోటీప‌డుతున్నారో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.