Begin typing your search above and press return to search.

'ఓ భామ అయ్యో రామ' మూవీ రివ్యూ

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. హీరోగా రాణిస్తున్న యువ నటుడు సుహాస్.

By:  Tupaki Desk   |   11 July 2025 8:23 PM IST
ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ
X

'ఓ భామ అయ్యో రామ' మూవీ రివ్యూ

నటీనటులు: సుహాస్- మాళవిక మనోజ్- ఆలీ- రవీంద్ర విజయ్- అనిత- పృథ్వీరాజ్- ప్రభాస్ శీను- రఘు కారుమంచి తదితరులు

సంగీతం: రధన్

ఛాయాగ్రహణం: మణికందన్

నిర్మాత: హరీష్ నల్ల

రచన-దర్శకత్వం: రామ్ గోదాల

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. హీరోగా రాణిస్తున్న యువ నటుడు సుహాస్. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీబ్యాండు లాంటి చిత్రాలతో మెప్పించిన అతను.. ఇప్పుడు 'ఓ భామ అయ్యో రామ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. అతణ్ని ఓ చేదు గతం వెంటాడుతుంటుంది. అతడికి అన్నీ తన మావయ్యే (ఆలీ). ఫారిన్ వెళ్లి ఎంఎస్ చేయాలన్నది అతడి కోరిక. డిగ్రీలో పద్ధతిగా చదువుకుంటూ తన లక్ష్యం వైపు అడుగులేస్తుంటాడు రామ్. ఓ యాక్సిడెంట్లో రామ్ కాపాడిన సత్యభామ (మాళవిక మనోజ్).. అతణ్ని ప్రేమిస్తుంది. రామ్ కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇలా తన జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో సత్యభామకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే తనను వెంటాడుతున్న చేదు గతం గుర్తుకొచ్చి ఇబ్బంది పడతాడు. ఇంతకీ తన గతమేంటి.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందిని అతనెలా అధిగమించాడు.. సత్యభామ-రామ్ ఒక్కటయ్యారా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెర మీదే తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: హీరో చిన్న‌పుడు స్కూల్లో నాట‌కాలు వేసి ప్ర‌శంస‌లు అందుకుంటాడు. త‌న టాలెంట్ చూసి పెద్ద‌య్యాక పెద్ద ద‌ర్శ‌కుడు అయిపోతాడ‌ని చుట్టూ ఉన్న వాళ్లు పొగుడుతారు. కానీ ద‌ర్శ‌కుడే అయిన అత‌డి తండ్రికి ఆ కొడుకంటే ఇష్టం ఉండ‌దు. అత‌డిని వ‌దిలించుకోవాల‌ని చూస్తాడు. ఇంత‌లో త‌నెంతో ఇష్ట‌ప‌డే త‌ల్లి కూడా దూర‌మ‌వుతుంది. ఇది హీరో చిన్న‌త‌నానికి సంబంధించిన చేదు జ్ఞాప‌కం. దీనికి హీరో సినిమాల ప‌ట్ల అయిష్ట‌త పెంచుకోవ‌డానికి సంబంధ‌మేంటో అర్థం కాదు. ఆ అయిష్ట‌త‌ను కూడా చిత్ర‌మైన రీతిలో చూపిస్తారు. సినిమా థియేట‌ర్‌కు వెళ్తాడ‌ట‌. కానీ లోప‌లికి వెళ్ల‌కుండా బ‌య‌టే ఉండి డైలాగులు మాత్ర‌మే విని సినిమా హిట్టో ఫ‌ట్టో చెప్పేస్తాడ‌ట‌. ఈ టాలెంట్ చూసి హీరోయిన్ అత‌ణ్ని ద‌ర్శ‌కుడిని చేసేద్దాం అనుకుంటుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఒక స్టార్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా పెట్టించేస్తుంది. అక్క‌డ అత‌ను ఏం టాలెంట్ చూపించాడు.. ఎలా డైరెక్టర్ అయ్యాడు.. త‌న ప్యాష‌న్ ఎలాంటిది.. ఇలా ఏమీ చూపించ‌రు. క‌ట్ చేస్తే అత‌ను స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అయిపోతాడు. సినిమా డైరెక్ట‌ర్ అయిపోవ‌డం ఇంత ఈజీనా అన్న‌ట్లుంటుంది వ్య‌వ‌హారం. ద‌ర్శ‌కుడు కావ‌డం.. ఒక క‌థ‌ను ఎంతోమందితో ఒప్పించి సినిమా తీయ‌డం ఎంత క‌ష్ట‌మో ఓ భామ అయ్యో రామ తీసిన ద‌ర్శ‌కుడికి తెలియ‌కుండా ఉండ‌దు. ఆ క‌ష్టం తెలిసిన వాడు ఈ వ్య‌వ‌హారాన్ని తెర‌పై ఇంత తేలిగ్గా ఎలా చూపించాడో మ‌రి. ఈ పాయింట్ మాత్ర‌మే కాదు.. ఓ భామ అయ్యో రామ‌లో చూపించే చాలా విష‌యాలు ఇలాగే పైపైన అనిపిస్తాయి. సుహాస్ అంటే క‌థ బ‌లంగా ఉంటుంది.. కొత్త‌గా ఉంటుంది అనే న‌మ్మకం మీద గ‌ట్టి దెబ్బ కొట్టే సినిమా ఇది.

తాగి యాక్సిడెంట్ చేసే హీరోయిన్.. ఆమెను కాపాడి ఇంటికి చేర్చే హీరో.. ఆ సాయానికి ముగ్ధురాలై ఆమె ప్రేమిస్తే.. తన మీద చూపించిన శ్ర‌ద్ధకు ఫ్లాట్ అయిపోయి అత‌ను ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఇలాంటి రొమాంటిక్ ట్రాక్ చూశాక ఈ సినిమాలో కొత్త‌ద‌నం ఆశించ‌డం క‌ష్ట‌మే అవుతుంది. ల‌వ్ స్టోరీయే ఇలా ఉంటే.. హీరో ఫ్లాష్ బ్యాక్ ఇంకో ప్ర‌హ‌స‌నం. మొద‌ట్నుంచి హీరో గ‌తం గురించి ఊరించి ఊరించి చివ‌రికి ఆ గుట్టేంటో విప్పాక‌.. దీనికా ఇంత బిల్డ‌ప్ ఇచ్చారు అనిపిస్తుంది. త‌ల్లీ కొడుకుల అనుబంధాన్ని.. వాళ్లిద్ద‌రితో తండ్రికి ఉన్న స‌మ‌స్య‌ను స‌రిగా ఎస్టాబ్లిష్ చేయ‌లేదు. ఫ్లాష్ బ్యాక్ మొత్తంగా తేలిపోవ‌డంతో వ‌ర్త‌మానంలో దాని తాలూకు ఎమోష‌న్ ఏదీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక ల‌వ్ స్టోరీ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ క్యారెక్ట‌ర్ని చాలా పేల‌వంగా.. గంద‌ర‌గోళంగా తీర్చిదిద్ద‌డంతో ఏ ద‌శ‌లోనూ దాంతో క‌నెక్ట్ కాలేదు. అదే స‌మ‌యంలో హీరో పాత్రతోనూ ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ఉండ‌దు. స‌న్నివేశాలు వ‌స్తుంటాయి పోతుంటాయి. కానీ ఏ ఫీలింగ్ క‌ల‌గ‌దు. హీరోయిన్ చెప్పే సినిమా క‌థ‌ల తాలూకు ఊహా స‌న్నివేశాలు.. అక్క‌డ‌క్క‌డా హీరో ఫ్రెండ్స్ ఇద్ద‌రూ చేసే హ‌డావుడి వ‌ల్ల కొంచెం కామెడీ వ‌ర్క‌వుట్ అయింది కానీ.. మిగ‌తా వ్య‌వ‌హార‌మంతా చాలా అస‌హ‌నాన్ని క‌లిగిస్తుంది.

ప్ర‌థ‌మార్ధం.. ద్వితీయార్ధం.. ల‌వ్ ట్రాక్.. ఎమోష‌న‌ల్ సీన్స్.. ఇలా తేడాలేమీ లేవు. ఓ భామ అయ్యో రామ‌లో అన్నీ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. ఒక‌ప్పుడు క‌థ‌ల ఎంపిక‌లో మంచి అభిరుచిని చూపించిన సుహాస్.. ఇప్పుడు ప‌ట్టు కోల్పోతున్నాడ‌న‌డానికి తాజా రుజువు.. ఓ భామ అయ్యో రామ‌. ట్రైలర్ చూస్తే ఇదో ఫ‌న్ రైడ్ లాగా అనిపిస్తుంది కానీ.. పైపైన సాగే స‌న్నివేశాల వ‌ల్ల వినోదం పండ‌లేదు. స‌రిగా డెవ‌ల‌ప్ చేయ‌ని పాత్ర‌లు.. కథాక‌థ‌నాల వ‌ల్ల ఇందులో ఏ ఎమోష‌న్ తోనూ క‌నెక్ట్ కాలేం ద్వితీయార్ధంలో వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్.. పెళ్లి ట్రాక్.. ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్షకుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. మొత్తంగా ఓ భామ అయ్యో రామ ఏ ర‌కంగానూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేకపోయింది. సుహాస్ క‌థ‌లు.. పాత్ర‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది.

నటీనటులు: కలర్ ఫొటో సహా సుహాస్ హీరోగా నటించిన కొన్ని చిత్రాల్లో తన పాత్రలు.. నటన కొత్తగా అనిపించేవి. వాటిలో అమాయకత్వంతో కూడిన తన నటన ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు అతను కొంచెం బోర్ కొట్టించేస్తున్నాడు. కారణం.. పాత్రలన్నీ ఒకేలా ఉండడమే. నటన కూడా మూసలో సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో కూడా 'హీరోయిజం' చూపించకుండా సాదాసీదా కుర్రాడిలా కనిపించడానికి ప్రయత్నించాడతను. కానీ పాత్రలో బలం లేకపోవడం వల్ల సుహాస్ పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. హీరోయిన్ మాళవిక మనోజ్ గ్లామర్ పరంగా వీకే. తమిళంలో 'జో' సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమెకు.. తెలుగు అరంగేట్రంలో సరైన పాత్ర దక్కలేదు. గందరగోళంగా అనిపించే సత్యభామ పాత్రలో ఆమె ప్రత్యేకతను చాటుకోవడానికి అవకాశం లేకపోయింది. హీరో మేనమామ పాత్రలో ఆలీ సీరియస్ గా నటించి మెప్పించాడు. తనను ఇలాంటి పాత్రల్లో చూడడం కొత్తగా అనిపిస్తుంది. హీరో స్నేహితుల పాత్రల్లో నటించిన ఆర్టిస్టులు కొంత నవ్వించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన పృథ్వీరాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. రవీంద్ర విజయ్ నెగెటివ్ రోల్ లో ఓకే అనిపించాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన 'నువ్వు నేను' అనిత బాగా చేసింది. ఇకముందూ ఆమెకు ఇలాంటి పాత్రలు ఆఫర్ చేయొచ్చు.

సాంకేతిక వర్గం: అందాల రాక్షసి.. అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ అంటే పాటల విషయంలో చాలా ఊహించుకుంటాం. కానీ 'ఓ భామ అయ్యో రామ'లో తన స్థాయిలో తగ్గ పాటలు పడలేదు. ఒక మెలోడీ పర్వాలేదనిపిస్తుంది. మిగతా పాటలన్నీ మామూలుగా సాగిపోయాయి. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. మణికందన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. ఇక రైటర్ కమ్ రామ్ గోదాల.. ఈ కథతో ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. ప్రధాన పాత్రలను అతను సరిగా తీర్చిదిద్దుకోలేదు. కథలో కీలకమైన అంశాలను సరిగా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు. రైటింగ్.. డైరెక్షన్ రెండూ వీకే.

చివరగా: ఓ భామ.. 'అయ్యో రామ'

రేటింగ్-2/5