పవన్- బాలయ్య మధ్య క్లాష్?
మరోవైపు పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత డీవీవీ దానయ్య డిస్ట్రిబ్యూటర్లతో అన్నారట.
By: Tupaki Desk | 22 May 2025 4:05 PM ISTటాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలకు రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోయింది. ఎంతో ముందుగానే డేట్స్ లాక్ చేసుకుంటే తప్పించి సోలో రిలీజులు దక్కడం లేదు. పోనీలే పోటీకి వెళ్దామంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు పోటీతో రిలీజైతే కలెక్షన్లు షేరవుతాయి. క్రమంగా కలెక్షన్ల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది.
అందుకే పెద్ద సినిమాల దర్శకనిర్మాతలంతా సోలో రిలీజ్ డేట్ కోసం చూస్తూ ఉంటారు. దాని కోసం ఎంతో ముందుగానే డేట్ ను లాక్ చేసుకుని ఆ డేట్ పై కర్చీఫ్ వేసుకుని ఉంచుకుంటున్నారు. రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు కానీ చెప్పిన డేట్ కు సినిమాలను రిలీజ్ చేయలేకపోతున్నారు. దానికి కారణం నటీనటుల కాల్షీట్స్, షూటింగ్ లేటవడం, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఏవైనా అవొచ్చు.
దీని వల్ల రిలీజ్ డేట్స్ వాయిదా పడటంతో పాటూ ఏ క్లాష్ అయితే వద్దనుకుంటున్నారో ఆ క్లాషే ఎదురయ్యే పరిస్థితులొస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్సున్నట్టు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య, బోయపాటి తో చేస్తున్న అఖండ2 సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్టు అనౌన్స్‌మెంట్ టైమ్ లోనే చెప్పారు.
మరోవైపు పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత డీవీవీ దానయ్య డిస్ట్రిబ్యూటర్లతో అన్నారట. అయితే ఓజీ సినిమాను ముందు సెప్టెంబర్ 5న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ టైమ్ లో సెలవులు ఉండవు కాబట్టి సెప్టెంబర్ 26 పండగ సీజన్ ను వాడుకోవాలని దానయ్య ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కనపెడితే ఇందులో సాధ్య అసాధ్యాలను చూస్తే ఈ రెండు సినిమాల మధ్య పోటీ దాదాపు ఉండదనే చెప్పాలి. దానికి కారణం పొలిటికల్ గా బాలయ్య, పవన్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని కాదని ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడి కలెక్షన్లను షేర్ చేసుకుని నష్టపోవాలని అనుకోరు. ఒకవేళ నిర్మాతలకు ఈ దిశగా ఆలోచనలున్నా హీరోలిద్దరూ మాట్లాడుకుని దాన్ని పరిష్కరించే వీలుంది. కాబట్టి ఓజీ, అఖండ2 సినిమాల మధ్య క్లాష్ దాదాపుగా ఉండకపోవచ్చు.
