పవన్ వెర్సన్ బాలయ్య.. తగ్గేదెవరు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
By: Tupaki Desk | 10 Jun 2025 10:26 AM ISTమెగా, నందమూరి బాక్సాఫీస్ క్లాష్ కొత్తేమీ కాదు. దశాబ్దాల నుంచి చూస్తున్నదే. ఈ సంక్రాంతికి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ పోటీ పడ్డాయి. అంతకుముందు చిరు సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య చిత్రం వీరసింహారెడ్డి ఢీకొట్టాయి. గతంలో ఇంకా మరెన్నో సందర్భాల్లో మెగా, నందమూరి బాక్సాఫీస్ పోరును చూశాం. కానీ ఈ ఏడాది దసరాకు మరోసారి పోరు తప్పేలా లేదు.
కానీ ఇప్పటిదాకా జరిగిన క్లాష్‌లు వేరు. ఈ పోరు వేరు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి సెప్టెంబరు 25ను రిలీజ్ డేట్‌గా ఎంచుకున్నారు. పవన్ సినిమా వస్తోందంటే.. అంతకుముందే ఆ డేట్‌కు ఫిక్సయిన బాలయ్య చిత్రం అఖండ-2 రాదనే అనుకున్నారంతా. కానీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్లో సేమ్ డేట్ వేశారు. పక్కాగా సినిమా ఆ రోజే రాబోతోందని తేల్చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాలయ్య, పవన్ మధ్య పోరును చూడాలని వారి అభిమానులు కోరుకోవట్లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య, పవన్ మధ్య ప్రస్తుతం మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడితే బాగుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల కారణంగా ఇరువురి అభిమానుల మధ్య కలహాలు మొదలై.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ తీవ్రమవుతాయేమ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ రోజుల్లో అభిమానులు.. అవతలి హీరోల మీద సోషల్ మీడియాలో విషం చిమ్మడం పెరిగిపోతోంది. సంక్రాంతి టైంలోనూ అదే జరిగింది. తమ హీరో సినిమా బాగా ఆడాలని అనుకోవడం కంటే.. అవతలి హీరో సినిమా నాశనమైపోవాలని కోరుకునేవాళ్లే ఎక్కువైపోయారు. ఇందుకోసం పనిగట్టుకుని విష ప్రచారాలు చేసుకుంటున్నారు. తద్వారా అభిమానుల మధ్య వైరం పెరిగిపోతోంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దసరాకు ఇద్దరు హీరోల్లో ఒకరు తగ్గి వేరే డేట్ చూసుకుంటే మంచిదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.