Begin typing your search above and press return to search.

హీరోయిన్ మాత్రం పోరాటం చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   25 July 2025 2:00 AM IST
హీరోయిన్ మాత్రం పోరాటం చేయాల్సిందే!
X

అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లు మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలే. హీరోకున్న లాంగ్ కెరీర్ హీరోయిన్ కు ఉండ‌దు. స్టార్ హీరోల‌గా స‌క్సెస్ అయితే అత‌డి కెరీర్ కి కొన్నాళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూసే ప‌ని ఉండ‌దు. కానీ హీరోయిన్ కెరీర్ అలా ఉండ‌దు. స‌క్సెస్ అయినా..ఫెయిలైనా అవ‌కాశాలు వ‌స్తాయి? అన్న గ్యారెంటీ కొన్ని సంద ర్భాల్లో క‌నిపించ‌దు. స‌క్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఫెయిలైన వాళ్ల‌లో కొంత మంది బిజీగా అవ‌కాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఇదే అంశాన్ని బాలీవుడ్ న‌టి న‌ష్ర‌త్ బ‌రుచ్ లేవ‌నెత్తింది.

`హీరో ఒక్క హిట్ కొట్ట‌గానే అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయి. కానీ హీరోయిన్ ప‌రిస్థితి అలా ఉండ‌దు. అవ‌కాశాల కోసం నిత్యం పోరాటం చేయాల్సిందే. `ప్యార్ కా పంచ్ నామా` సినిమా నుంచి ఇదే మాట చెబుతున్నా? ఏ న‌టి అయినా హిట్ అందుకుంటే మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. కెరీర్ బాగుంటుంద‌ని ఆశ‌ప‌డ‌తారు. నేను అలాగే ఆశ‌ప‌డ్డాను. కానీ నా కెరీర్ అలా సాగ‌లేదు. హీరోల త‌రహాలో కాక‌పోయినా స‌రైన అవ‌కాశాలు అందుకో వ‌డంలో వెనుక‌బ‌డే ఉన్నాను. కొంత మంది హీరోయిన్ల ప‌ట్ల ఆన్ సెట్స్ లో కూడా వివ‌క్ష క‌నిపిస్తుంది.

వ్య‌క్తిగ‌తంగా హీరో వ్యానిటీ వ్యాన్ ను ఐదు నిమిషాలు వాడుకోవ‌చ్చా? అంటే ఇవ్వ‌ని ప‌రిస్థితి చూసాను. సెట్ లో స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో వాష్ రూమ్ కోసం వ్యానిటీ అడిగితే త‌లెత్తిన స‌న్నివేశం అది. కానీ ఆ సంద‌ర్భంలో నేను ఎవ‌రితోనూ గొడ‌వ‌కు దిగ‌లేదు. స‌మాజం తీరే అంత అనుకున్నాని స‌ర్దు కున్నాను. అలాగ‌ని హీరోలంతా అలాగే ఉండ‌రు. కొంద‌రు మాత్ర‌మే భిన్న వైఖ‌రిని క‌లిగి ఉంటారు. అలాంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా స‌హాయం అడ‌గడం మానేసాను` అంది.

ఇటీవ‌లే న‌ష్ర‌త్ న‌టించిన `చోరీ 2` ఓటీటీలో రిలీజ్ అయింది. ప్ర‌స్తుతం ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ అమ్మ‌డు టాలీవుడ్ కు సుప‌రిచితమే. శివాజీ హీరోగా న‌టించిన `తాజ్ మ‌హ‌ల్` సినిమాలో న‌టించింది. అప్ప‌టికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. వాటి త‌ర్వాతే తెలుగులో లాంచ్ అయింది. అటుపై మ‌ళ్లీ మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. బాలీవుడ్ లోనే కొన‌సాగింది.