వాష్‌రూమ్ కోసం అనుమతి కోరాల్సి వచ్చేది: నటి ఆవేదన
సినిమా సెట్‌లలో కనీస సౌకర్యాల విషయంలోను హీరోలకు ఉన్న సౌకర్యం హీరోయిన్లకు ఉండదని నుష్రత్ అన్నారు.
By: Tupaki Desk | 25 July 2025 8:30 AM ISTసినీపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు, అసౌకర్యాల గురించి హేమ కమిటీ బహిర్గతం చేసిన విషయాలు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ మహిళలకు సరైన వ్యానిటీ సౌకర్యం లభించదు. కనీసం టాయ్ లెట్లు కూడా సరిగా ఉండవు. గోప్యతకు అవకావం లేదు. మహిళలు దుస్తులు మార్చుకునే చోటు, మేకప్ వేసుకునే చోటు అంతగా సౌకర్యంగా ఉండవు.
ఇప్పుడు ప్రముఖ హిందీ నటి నుష్రత్ భారూచా పరిశ్రమలో లింగ వివక్ష గురించి, మేల్ డామినేషన్ గురించి సూటిగా ప్రస్థావించింది. పరిశ్రమలో ఎవరైనా మేల్ స్టార్ ఒక హిట్టు కొడితే వెంట వెంటనే పది అవకాశాలొస్తాయని, కానీ మహిళా ఆర్టిస్టు విజయం సాధించినా అవకాశాలు వెంట పడవని నుష్రత్ తన అనుభవాన్ని ఉదహరించింది. ఇలాంటి అవకాశాల కోసం మహిళలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. `ప్యార్ కా పంచనామా` (2011) విజయం సాధించిన తర్వాత కూడా నేను అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని నుష్రత్ తెలిపింది. ఒక అమ్మాయి అవిశ్రాంతంగా అలా పని చేస్తూనే ఉండాలని అంది.
సినిమా సెట్‌లలో కనీస సౌకర్యాల విషయంలోను హీరోలకు ఉన్న సౌకర్యం హీరోయిన్లకు ఉండదని నుష్రత్ అన్నారు. వానిటీ వ్యాన్ లేదా వాష్‌రూమ్‌ను ఉపయోగించడానికి అనుమతి తీసుకోవాల్సిన సందర్భాలున్నాయని తెలిపింది. హీరోల కోసం ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. కానీ మహిళా నటీమణులకు ఆ అవకాశం ఉండదు. నేను అప్పుడు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు ఎందుకంటే నేను ఇలాంటి సౌకర్యాలను పొందే స్థాయికి ఎదగాలని బలంగా నిశ్చయించుకున్నానని తెలిపింది.
విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హీరోలు బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తే, తాను మాత్రం ఎకానమీ క్లాస్ లో ప్రయాణించానని కూడా నుష్రత్ వెల్లడించింది. ఒకప్పుడు నేను టెక్నీషియన్ల సహాయకులతో కలిసి కూర్చున్నాను. ఇప్పుడు క్రమం తప్పకుండా పని కోసం బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నందున ఈ సంకల్పం చివరికి ఫలించిందని తెలిపింది. నుష్రత్ చివరిసారిగా విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన హర్రర్ సీక్వెల్ `చోరి 2`లో కనిపించింది. ఇప్పుడు మేల్ డామినేషన్ గురించి ధైర్యంగా ఈ భామ గళం విప్పింది.
