వార్ 2 ఒప్పుకోవడానికి కారణం అదే: ఎన్టీఆర్
ఆసక్తికరంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించారు.
By: Sivaji Kontham | 11 Aug 2025 10:06 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఈనెల 14న అత్యంత భారీగా వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాదినా అత్యంత భారీగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన భారీ ఈవెంట్ కి వేలాదిగా ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు. నెవ్వర్ బిఫోర్ అనేలా అత్యంత భారీగా నిర్మించిన వేదిక వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది తెలంగాణ పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయాల్సి వచ్చింది.
వేదిక వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీ ఏర్పాట్లతో తెలంగాణ పోలీస్ సహకరించారు. దీనికి ముందస్తు అనుమతులు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఈ వేదిక ఆద్యంతం మెరుపులే మెరుపులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ వేదికపై ఎంతో జోష్ తో కనిపించారు. ఆసక్తికరంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించారు.
నేను వార్ 2 చిత్రం చేయడానికి ముఖ్య కారణం నిర్మాత ఆదిత్య చోప్రా. ఆయన వెంటపడటం వల్ల ఈ సినిమాకి ఓకే చెప్పానని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథన బలం ఇవన్నీ పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో నటించాలని పట్టుబట్టిన ఆదిత్య చోప్రాను మర్చిపోలేను. నువ్వు ఈ మూవీ చేయాలి అని నా వెంటపడి, నాకు భరోసాను కల్పించారు. మీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపందిస్తాను.. నన్ను నమ్ము! అని ఆదిత్యా చోప్రా మాటిచ్చారు'' అని తెలిపారు. ఆది సర్ మాట వినకుండా .. నమ్మకుండా ఉంటే ఈరోజు ఇది జరిగేది కాదు. ఇంత ధైర్యం గా మీ ముందు నిలిచేవాడిని కాదు. నాకు నమ్మకాన్ని భరోసాను ఇచ్చినందుకు ఆదిత్య సర్ కి థాంక్యూ.. అని అన్నారు.
నిజానికి నాకు బొంబాయి అంతగా నచ్చదు.. అలాంటిది 76 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నంత సేపు నాకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంది వైఆర్ఎఫ్ సంస్థ. నాకు కష్టం అన్నదే లేకుండా చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్టే అనిపించింది. అంతటి సౌకర్యం ఇచ్చిన వైఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు.. అని వైఆర్ఎఫ్ ను కీర్తించారు. అంతేకాదు యష్ రాజ్ ఫిలింస్ తో కలిసి మళ్లీ మళ్లీ పని చేసేందుకు తారక్ ఉత్సాహంగా ఉన్నానని ఈ వేదికపై ప్రకటించారు.
అభిమానులకు పిలుపు:
ఈవెంట్ ఆద్యంత తన అభిమానులే తాను ఈ స్థాయికి రావడానికి కారణమని వారికి శిరస్సు వంచి పాద నమస్కారాలు చేస్తున్నానని తారక్ అన్నారు. అంతేకాదు.. తిరిగి వెళ్లేప్పుడు అభిమానులు జాగ్రత్తగా క్షేమంగా వెళ్లాలని కోరుకున్నారు. ఇంటి దగ్గర మీవాళ్లు ఎదురు చూస్తుంటారు. దయచేసి ఎవరూ వేగంగా వెళ్లొద్దు.. జాగ్రత్తగా ఇండ్లకు చేరుకోవాలని కోరారు.
