అప్పటి వరకు డ్రాగన్ తోనేనా తారక్?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో డ్రాగన్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 12:49 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. రీసెంట్ గా వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయారు తారక్. రిలీజ్ కు ముందు వార్2 పై ఎన్నో అంచనాలున్నాయి. హృతిక్- తారక్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో పాటూ, ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా అవడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది.
అంచనాలను అందుకోలేకపోయిన వార్2
కానీ ఆ క్రేజ్ ను, అంచనాలను వార్2 ఏ మాత్రం అందుకోలేకపోయింది. కొందరైతే సాఫీగా వెళ్తున్న జర్నీని ఎన్టీఆర్ అనవసరంగా వార్2 చేసి రిస్క్ లో పెట్టుకున్నారని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. వార్2 తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.
డ్రాగన్ పై భారీ అంచనాలు
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో డ్రాగన్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్లో ఎన్నడూ లేనంత స్లిమ్ గా తయారై, డ్రాగన్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. డ్రాగన్ మూవీలో నీల్, ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ లుక్స్ లో ప్రెజెంట్ చేయనున్నారని తెలుస్తోంది.
అక్టోబర్ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను అందించారు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్. డ్రాగన్ మూవీ కొత్త షెడ్యూల్ అక్టోబర్ నెలాఖరు నుంచి మొదలై, నెక్ట్స్ సమ్మర్ వరకు నిరంతరాయంగా జరగనుందని, సినిమా ఎక్స్‌ట్రాఆర్డినరీగా వస్తుందని ఆయన తెలిపారు. అంటే డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ నెక్ట్స్ సమ్మర్ వరకు లాక్ అయిపోతే, ఇక త్రివిక్రమ్ సినిమా, దేవర2 ఎప్పుడు మొదలవుతాయో, ఆ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా చేస్తూనే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సినిమా పనుల్ని కూడా చూసుకుంటున్నారని తెలుస్తోంది.
