ఎన్టీఆర్ జయంతి: ఆ రెండు పాత్రలలో ఇంకెవరినైనా ఊహించుకోగలరా?
ఆ కాలంలో తెలుగువారి ఇళ్లలోని పూజా గదులను గమనిస్తే.. అక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడి పటాలు ముమ్మాటికీ తారక రాముని రూపంతో ముడిపడి ఉన్నవే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Sivaji Kontham | 29 May 2026 1:48 AM ISTతెలుగు సినిమా హిస్టరీలో నందమూరి తారక రామారావు స్థానం అద్వితీయం. వెండితెరపై ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. అవి సాక్షాత్తూ దైవత్వాన్ని ఆవిష్కరించాయి. అన్నగారు తెరపై శ్రీరాముడిగా లేదా శ్రీకృష్ణుడిగా కనిపించినప్పుడు ఆయన నటనలోని అపారమైన శక్తి - దైవిక కళా వైభవాన్ని చూసి నాటి ప్రజలు, ప్రేక్షకులు ఆయనను కేవలం ఒక సినిమా స్టార్‌లా చూడలేదు. ఆ రూపంలో సాక్షాత్తూ భగవంతుడే తమ ముందుకు నడిచి వచ్చాడని యావత్ తెలుగు సమాజం ఎంతో ఉద్వేగంతో భక్తిభావంతో నమ్మింది.
ఆ కాలంలో తెలుగువారి ఇళ్లలోని పూజా గదులను గమనిస్తే.. అక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడి పటాలు ముమ్మాటికీ తారక రాముని రూపంతో ముడిపడి ఉన్నవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మురళీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ చూపిన మందహాసం... పలికించిన హావభావాలు చూసి జనం సాక్షాత్తూ ఆ కృష్ణ పరమాత్ముడినే దర్శించుకుంటున్నామని భావించి మురిసిపోయేవారు. `మాయాబజార్`, `శ్రీకృష్ణార్జున యుద్ధం`, `శ్రీకృష్ణావతారం`, `కురుక్షేత్రం` వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలలో ఆయన పోషించిన కృష్ణుడి పాత్రలు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.
అదేవిధంగా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి పాత్రలోనూ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి లుక్‌ను తప్ప మరొకరిని అంగీకరించడానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడేవారు కాదు. రాముడి పాత్రకు తారక రాముడే సర్వశ్రేష్టుడు.. సరైన వాడు అనే బలమైన అభిప్రాయం ప్రేక్షక దేవుళ్లలో బలంగా నాటుకుపోయింది. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం, భూకైలాస్ వంటి చారిత్రాత్మక చిత్రాలలో ఆయన రాముడిగా చూపిన రాజసం, గంభీరత మరెవరికీ సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ కాకుండా మరే ఇతర నటుడు ఆ రెండు పవిత్రమైన పాత్రల్లో కనిపించినా ప్రేక్షకలోకం వారిని అంతగా ఆదరించలేకపోయింది.. రిసీవ్ చేసుకోలేకపోయింది.
ఎన్టీఆర్ తన సుదీర్ఘ నట ప్రస్థానంలో శ్రీకృష్ణుడిగా , శ్రీరాముడిగా వేర్వేరు చిత్రాలలో పదే పదే నటించి మెప్పించారు. సతీ సక్తాక్షి, వినాయక చవితి, దీపావళి వంటి చిత్రాలలో కృష్ణుడి భిన్నమైన కోణాలను ఆవిష్కరించగా.. `శ్రీరామ పట్టాభిషేకం` వంటి చిత్రాల ద్వారా రాముడి వైభవాన్ని వెండితెరకు అద్దం పట్టారు. పౌరాణిక పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేసిన విధానం.. ఉచ్ఛారణ... అంగికాభినయం భారతీయ సినిమా రంగంలోనే ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. అందుకే తరాలు మారినా ఆయా పాత్రలకు ఆయనే ఏకైక కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
కాలక్రమంలో పౌరాణిక చిత్రాల మేకింగ్ శైలి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామాయణం` చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ లుక్.. నటనను నేటితరం ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు... అలాగే అన్నగారు సృష్టించిన ఆ పౌరాణిక ముద్రను ఈ తరం నటులు ఎంతవరకు అందుకోగలరు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మునుముందు `మహాభారతం` కథలతో సినిమాలు తీసేందుకు మన దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ సిల్వర్ స్క్రీన్ పై శ్రీకృష్ణునిగా జీవించిన తారక రామునిలా బలమైన ముద్ర వేయగలిగే నటులను వెతకడంలో, పాత్రల్ని సృజించడంలో ఎంతవరకూ సఫలమవుతారో వేచి చూడాలి.
