వార్2 డ్యాన్స్ నెంబర్ కోసం నిర్మాతల స్పెషల్ ప్లాన్
దేవర తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా వార్2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 12:54 PM ISTదేవర తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా వార్2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ స్పై థ్రిల్లర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఎన్టీఆర్- హృతిక్ పై స్పెషల్ డ్యాన్స్ నెంబర్
అటు హృతిక్ రోషన్, ఇటు ఎన్టీఆర్ మంచి నటులు కావడంతో పాటూ ఇద్దరూ మంచి డ్యాన్సర్లవడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ పై ఓ స్పెషల్ సాంగ్ ను కూడా అయాన్ తెరకెక్కించారు. వీరిద్దరూ కలిసి ఓ సాంగ్ లో కాలు కదిపారంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పోటీ పడి స్టెప్పులేసిన స్టార్లు
ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ డ్యాన్స్ వేశారని, సాంగ్ మొత్తంలో ఇద్దరిలో ఎవరిని చూడాలో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని బాలీవుడ్ వర్గాల నుంచి ఇప్పటికే ఎన్నో వార్తలొచ్చాయి. అలాంటి సాంగ్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేసి సినిమాపై ఉన్న బజ్ ను పెంచాలని అనుకుంటున్నారని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
గ్లింప్స్ తోనే హైప్ పెంచాలని ప్లాన్
తాజా సమాచారం ప్రకారం యష్ రాజ్ ఫిల్మ్స్, హృతిక్- ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన స్పెషల్ డ్యాన్స్ సాంగ్ ను అలా రిలీజ్ చేయాలనుకోవడం లేదని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్లకు రావాలని నిర్మాత ఆదిత్య చోప్రా అనుకుంటున్నారని, అందుకే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సాంగ్ లోని చిన్న గ్లింప్స్ ను మాత్రమే ముందు యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 14న వార్2 హిందీతో పాటూ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
