తారక్ ఫ్యాన్స్ కు తప్పని ఇబ్బందులు
మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటిగా వస్తోన్న వార్2 సినిమా ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2025 11:29 AM ISTమోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటిగా వస్తోన్న వార్2 సినిమా ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ, హృతిక్, ఎన్టీఆర్ కలిసి మొదటిసారి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమాకు సంబంధించి సాలిడ్ ప్రమోషన్స్ ను మేకర్స్ పెద్దగా మొదలుపెట్టినట్టు కనిపించడం లేదు. రిలీజైన కంటెంట్ ప్లస్ ఆల్రెడీ మొదటి నుంచి ఉన్న హైప్ తప్పించి కొత్తగా ప్రమోషన్స్ తో వార్2 పై బజ్ ను పెంచే ప్రయత్నాలు మేకర్స్ ఇప్పటివరకు చేసింది లేదు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చింది లేదు.
సినిమాలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా కనిపించనుండగా, సోషల్ మీడియాలో కూడా అలానే ప్రత్యర్థులుగా ట్వీట్లు వేసుకుంటూ డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీని మెయిన్‌టెయిన్ చేస్తూ వస్తున్నారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య పోటీ పెరగాలంటే ఇదే సరైన మార్గమని నిర్మాణ సంస్థ భావించినట్టుంది. అందుకే వీరిద్దరినీ ప్రమోషన్స్ లో కూడా దూరంగా ఉంచుతూ వచ్చారు.
మొదటిసారి కలిసి కనిపించబోతున్న తారక్, హృతిక్
అయితే ఆదివారం(ఆగస్ట్ 10) హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ లో మొదటిసారి వీరిద్దరూ కలిసి కనిపించనున్నారు. వార్2కు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద ఈవెంట్ ఇదే. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. అసలే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగి చాలా ఏళ్లు అవుతుండటం, గతేడాది నోవాటెల్ లో జరగాల్సిన దేవర ఈవెంట్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా క్యాన్సిల్ అవడంతో వార్2 ఈవెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్.
టెన్షన్ లో తారక్ ఫ్యాన్స్
వార్2 గురించి, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడే మాటలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారా అనేది తెలుసుకోవడానికి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ విషయంలో అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని భయపడుతున్నారు కూడా. గత రెండు మూడు రోజులుగా భాగ్య నగరంలో సాయంత్రం సమయానికి మబ్బులు కమ్మేసి వర్షం కుండపోతగా పడుతున్న నేపథ్యంలో ఈవెంట్ సమయంలో వర్షం పడితే పరిస్థితేంటని కంగారు పడుతున్నారు. మరి వరుణ దేవుడు వార్2 కోసం కరుణిస్తాడో లేక వర్షంతో కాటేస్తాడో చూడాలి.
