సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న తారక్
ఎన్నో ఆశలు పెట్టుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ చేసిన వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో తారక్ కొంత కాలం పాటూ అన్నింటి నుంచి గ్యాప్ తీసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2025 11:09 AM ISTఎన్నో ఆశలు పెట్టుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ చేసిన వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో తారక్ కొంత కాలం పాటూ అన్నింటి నుంచి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అన్నింటినీ అధిగమించి, తన నెక్ట్స్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు తారక్. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా డ్రాగన్ ను కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న విషయం తెలిసిందే.
జనవరి వరకు నో అప్డేట్స్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా, లాస్ట్ వీక్ ఈ సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే తిరిగి మొదలుపెట్టినట్టు సమాచారం. అంతేకాదు, డ్రాగన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ను చిత్ర యూనిట్ వచ్చే ఏడాది జనవరి వరకు రిలీజ్ చేయడానికి రెడీగా లేదని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది.
భారీ నష్టాల్ని మిగిల్చిన వార్2
అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డ్రాగన్ ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంపైనే తమ దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ సారి ఆడియన్స్ ను కచ్ఛితంగా మెప్పించేలా ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు భారీ నష్టాన్ని కలిగించడంతో పాటూ డిస్ట్రిబ్యూటర్లకు బాగా నష్టాలను మిగిల్చింది.
డ్రాగన్ లో రిషబ్ శెట్టి గెస్ట్ రోల్
అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందు నుంచే తారక్ జాగ్రత్తపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొన్ని సర్‌ప్రైజులు కూడా ఉంటాయని అంటున్నారు. డ్రాగన్ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గెస్టు రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఎన్టీఆర్ తో తనకున్న బాండింగ్ వల్ల రిషబ్ ఈ క్యారెక్టర్ ను చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
