Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్ టీమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, జోర్డాన్‌లో ఉన్న ఇండియ‌న్స్‌కు అఫీషియ‌ల్ అడ్వైజరీ జారీ కావడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 Feb 2026 11:22 PM IST
డ్రాగ‌న్ టీమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!
X

ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, జోర్డాన్‌లో ఉన్న ఇండియ‌న్స్‌కు అఫీషియ‌ల్ అడ్వైజరీ జారీ కావడంతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న భారీ ప్రాజెక్టు డ్రాగ‌న్ షూటింగ్ పై ఎన్నో రూమ‌ర్లు వినిపించాయి. కానీ రియాలిటీలో సిట్యుయేష‌న్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

ప‌రిస్థితుల‌ను ముందే అంచ‌నా వేసిన మేక‌ర్స్

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్టీఆర్- నీల్ సినిమాకు సంబంధించి జోర్డాన్‌లో జరగాల్సిన కీలక షెడ్యూల్‌ను చిత్రబృందం ముందుగానే పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అసలు ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్ మార్చి ఫ‌స్ట్ వీక్ వరకు కొనసాగాల్సి ఉన్నా, పరిస్థితులను ముందే బేరీజు వేసిన చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25కే షూటింగ్‌ను ముగించి ఇండియాకు తిరిగొచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు క్షణక్షణం మారుతున్న నేపథ్యంలో ఈ ముందస్తు నిర్ణయం ఇప్పుడు టీమ్‌కు పెద్ద రిలీఫ్‌గా మారింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో లాజిస్టిక్స్, భద్రత, వాతావరణం లాంటి అంశాలు కీలకం. ముఖ్యంగా విదేశీ షూటింగ్‌లలో ఒక చిన్న అంతరాయం కూడా కోట్ల రూపాయల నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకుని షెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేయడం ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాన్ని చూపిస్తోంది.

షూటింగ్ నిలిచిపోయింద‌ని వార్త‌లు

ఇదిలా ఉంటే జోర్డాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయన్న వార్తలతో సోషల్ మీడియాలో డ్రాగ‌న్ షూట్ నిలిచిపోయిందని, టీమ్ అక్కడే చిక్కుకుపోయిందని పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. మూవీ ఇప్పటికే కొంత ఆలస్యాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆల‌స్యానికి దారి తీస్తుందనే చర్చలు కూడా వినిపించాయి.

రూమర్స్ vs రియాలిటీ

కానీ డ్రాగ‌న్ మూవీ జోర్డాన్ షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. ఇక ఈ మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ ఇండియాలోనే జ‌ర‌గాల్సి ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితులు ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలా రూమర్లకు చెక్ పడటమే కాకుండా, యూనిట్ ముందస్తు ప్రణాళిక ఎంత పక్కాగా ఉందో కూడా దీన్ని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చింది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కు ప‌లు భారీ ప్రాజెక్టుల‌ను స‌మ‌ర్థవంతంగా నిర్వ‌హించిన అనుభ‌వ‌ముంది. మారుతున్న ప‌రిస్థితుల‌ను ముందుగానే అంచ‌నా వేసి షెడ్యూల్ ను రీ అరేంజ్ చేయ‌డం, భ‌ద్ర‌తా అంశాల‌ను ప్రాధాన్య‌త ఇవ్వడం లాంటి నిర్ణ‌యాలు వారి ప్రొఫెష‌న‌లిజాన్ని మ‌రోసారి ఋజువు చేస్తున్నాయి. మొత్తానికి, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య ఊహాగానాలు చెలరేగినా, ప్రీ ప్లానింగ్ వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతోంది. రూమర్లకు బదులుగా వాస్తవం ఏమిటో స్పష్టమవడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు.