ట్రెండీ టాక్: శకుని మామ అనే దురంధర్.. 'డ్రాగన్'లో ఎన్టీఆర్ రోల్ ఇంట్రెస్టింగ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `డ్రాగన్`.
By: Sivaji Kontham | 23 May 2026 9:31 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `డ్రాగన్`. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచే తారక్ పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న క్యారెక్టర్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్రెండీ టాక్ వినబడుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మహాభారతంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ అడిగిన ఒక ఠిపికల్ ప్రశ్నకు ఎన్టీఆర్ ఇచ్చిన ఆశ్చర్యకరమైన సమాధానమే ఇప్పుడు ఈ చర్చకు ప్రధాన కారణమైంది. మహాభారత యుద్ధంలో అసలైన విన్నర్ ఎవరు? లార్డ్ శ్రీకృష్ణుడా? లేదా అర్జునుడా? అని నీల్ ప్రశ్నించగా.. ఎన్టీఆర్ ఏమాత్రం తడుముకోకుండా `శకుని` అని సమాధానం ఇచ్చారట. అసలు మహాభారత యుద్ధానికి, కురువంశ సర్వనాశనానికి వ్యూహకర్త శకునే కాబట్టి.. అతడే నిజమైన విజేత అనేది ఎన్టీఆర్ అభిప్రాయం.
ఈ సమాధానాన్ని బట్టి `డ్రాగన్` చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ డార్క్ పాత్రలో నటించబోతున్నాడనే లీకులు అందుతున్నాయి. అంటే కేవలం శారీరక ధృఢత్వం, కండ బలంతో కొట్టే హీరోలా కాకుండా.. శకుని మామ తరహాలో తెరవెనుక ఉండి యుద్ధ తంత్రాలు, కుట్రలు, కుతంత్రాలతో శత్రువులపై విరుచుకుపడే మైండ్ గేమ్ క్యారెక్టర్‌లో తారక్ కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ.. తాను ఇప్పటివరకు తన సినిమాల్లో క్రియేట్ చేసిన పాత్రలన్నింటిలోకి అత్యంత డార్క్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో వెండితెరపై తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న విలనిజం లౌక్యాన్ని ఏ స్థాయిలో పండించబోతున్నారోనని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు.
మరో ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా కథాంశం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే `ఓపియం - డ్రగ్స్ మాఫియా` నేపథ్యంలో సాగనుంది. బ్యాక్‌డ్రాప్ అంతా డ్రగ్స్ నెట్‌వర్క్ చుట్టూ తిరిగినా.. ఇందులో అంతర్లీనంగా దేశభక్తి ఎలిమెంట్‌ను చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తున్నట్లు దర్శకుడు నీల్ హింట్ ఇచ్చారు. ఈ పాయింట్ బయటకు రావడంతో ట్రేడ్ విశ్లేషకులు ఎన్టీఆర్ పాత్రను బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం `దురంధర్` లోని రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్‌తో పోలుస్తున్నారు. దురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ శత్రుదేశమైన పాకిస్తాన్‌లో అడుగుపెట్టి విధ్వంసం సృష్టించే ఒక అండర్‌కవర్ గూఢచారిగా కనిపించి.. చివరికి తనలోని అసలైన దేశభక్తితో ప్రేక్షకులను మెప్పించాడు.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం `డ్రాగన్`లో ఎన్టీఆర్ పాకిస్తాన్ లో గూఢచర్యం చేయకపోయినా ఆ దురంధర్ తరహా షేడ్స్ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయంటున్నారు. ఓపియం మాఫియా సామ్రాజ్యంలోకి ఒక సాధారణ వ్యక్తిలా ప్రవేశించి.. లోపల ఉన్న లూప్‌హోల్స్ అన్నింటినీ శకునిలా తన మైండ్ గేమ్‌తో వాడుకుంటూ ఆ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను తుదముట్టించే ఒక విలక్షణ పాత్రలో తారక్ మెరవనున్నారు. పైకి నెగెటివ్ లా కనిపిస్తూనే దేశం కోసం పరోక్షంగా ఒక పెద్ద మాఫియాను అంతం చేసే ఈ క్యారెక్టరైజేషన్.. దేశంలోని అతి భారీ మాఫియా యాక్షన్ సినిమాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే క్రూరమైన ప్రతినాయక లక్షణాలు ఉన్నా.. కథానాయకుడిగా మెప్పించే వినూత్న ప్రయోగానికి ప్రశాంత్ నీల్ శ్రీకారం చుట్టారు. కుటిల రాజకీయాలు, కుట్రలను సమర్థంగా నడిపించే ఒక శకుని తరహా నైజంతో.. దురంధర్ తరహా గంభీరమైన దేశభక్తి మిళితమైన ఎన్టీఆర్ డార్క్ షేడ్ పాత్ర `డ్రాగన్` ప్రపంచంలో ప్రేక్షకులను కచ్చితంగా మైమరపిస్తుందని సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన `డ్రాగన్ టీజర్ గ్లింప్స్` ఇప్పటికే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ట్రైలర్ గ్లింప్స్ కోసం యంగ్ టైగర్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
