Begin typing your search above and press return to search.

ఆశలు రేకెత్తిస్తున్న ఈ వారం సినిమాలు

నవంబరును సాధారణంగా సినిమాలకు అంతగా కలిసొచ్చే నెలగా భావించరు. దసరా, దీపావళి పండుగలొచ్చే అక్టోబరులో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 Nov 2025 4:00 AM IST
ఆశలు రేకెత్తిస్తున్న ఈ వారం సినిమాలు
X

నవంబరును సాధారణంగా సినిమాలకు అంతగా కలిసొచ్చే నెలగా భావించరు. దసరా, దీపావళి పండుగలొచ్చే అక్టోబరులో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంటుంది. డిసెంబరులో క్రిస్మస్ సీజన్ వల్ల పేరున్న చిత్రాలు రిలీజవుతుంటాయి. మధ్యలో నవంబరు నెలను చిన్న సినిమాలకే వదిలేస్తుంటారు. ఐతే ఈసారి మాత్రం నవంబరులో మిడ్ రేంజ్ సినిమాల సందడి బాగానే ఉంది. ఈ నెల తొలి వారంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ లాంటి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది. రెండో వారంలో ‘కాంత’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

కానీ అది అంచనాలను అందుకోలేకపోయింది. చివరి వారంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లాంటి క్రేజీ మూవీ రాబోతోంది. దాంతో పాటు కీర్తి సురేష్ మూవీ ‘రివాల్వర్ రీటా’ కూడా థియేటర్లలోకి రానుంది. మధ్యలో మిగిలిన వారంలో చిన్న సినిమాల సందడి చూడబోతున్నాం. ఐతే బడ్జెట్ పరంగా అవి చిన్న చిత్రాలే అయినా కంటెంట్ పరంగా రిచ్ అనిపిస్తున్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్‌కు ‘నాంది’ తర్వాత సరైన విజయం లేదు. ఇప్పుడతడి నుంచి ‘12 ఏ రైల్వే కాలనీ’ రాబోతోంది. ‘పొలిమేర’ ఫ్రాంఛైజీ రైటర్ అనిల్ విశ్వనాథ్ స్క్రిప్టు అందించిన చిత్రం కావడం, ట్రైలర్ రేసీగా, ఉత్కంఠభరితంగా ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలే. థ్రిల్లర్ ప్రియులను ఈ సినిమా బాగానే ఆకట్టుకునేలా ఉంది. నరేష్‌కు ఇది బ్రేక్ ఇచ్చే సినిమా కావచ్చని బలంగా నమ్ముతోంది టీం. ఇక ప్రియదర్శి.. ‘ప్రేమంటే’ అనే కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీతో వస్తున్నాడు. ‘మిత్రమండలి’ బ్యాక్ ఫైర్ అయ్యాక ఈ చిత్రం మీద ప్రియదర్శి నమ్మకంతో ఉన్నాడు. ‘మిత్రమండలి’ నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దంటూ ఇంతకుముందు చేసిన కామెంట్ తప్పు అని అంగీకరించిన దర్శి.. ‘ప్రేమంటే’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమాగా చెబుతున్నాడు.

దీని ట్రైలర్ కూడా క్రేజీగా అనిపించింది. ఇక ఈ వారం సినిమాల్లో చాలా స్పెషల్ అనిపిస్తున్నది.. రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా హీరో హీరోయిన్లు, దర్శకుడు.. అందరూ కొత్త వాళ్లే. కానీ ‘రాంబాయి నీ మీద నాకు’ పాట విన్నా.. ట్రైలర్ చూసినా.. ఇది విషయం ఉన్న సినిమా అనిపిస్తోంది. అదిరిపోయే కంటెంట్‌తో ఆశ్చర్యపరుస్తున్న ఈటీవీ విన్ వారి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని అనిపిస్తోంది. మొత్తంగా ఈ మూడు చిత్రాలూ కంటెంట్ రిచ్‌గానే అనిపిస్తూ ఆశలు రేకెత్తిస్తున్నాయి.