Begin typing your search above and press return to search.

200కోట్ల దోపిడీ కేసు: కోర్టులో నోరాఫ‌తేహి వాంగ్మూలం న‌మోదు

కాన్ ఆర్టిస్ట్ సుఖేష్ చంద్రశేఖర్‌తో నాకు సంబంధం ఉందని నిరాధారంగా ఆరోపించారని నోరా ఈ వాంగ్మూలం లో పేర్కొంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:54 AM GMT
200కోట్ల దోపిడీ కేసు: కోర్టులో నోరాఫ‌తేహి వాంగ్మూలం న‌మోదు
X

కాన్ మ్యాన్ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ 200 కోట్ల దోపిడీ కేసుతో సంబంధం ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జాక్విలిన్ - నోరా న‌డుమ పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత శ‌త్రుత్వం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీ‌లంక‌న్ బ్యూటీ .. నటి కం మోడ‌ల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స‌హా డజనుకు పైగా మీడియా సంస్థల పై పరువునష్టం ఫిర్యాదుకు సంబంధించి నటి నోరా ఫతేహి సోమవారం ఢిల్లీ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని వినిపించారు. 200 కోట్ల రూపాయల దోపిడీ కేసు లో మిలియనీర్ కాన్‌మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న కేసు లో త‌న పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల కు సంబంధించి నోరా వాంగ్మూలం అందించింది.

దేశ రాజధాని లోని పాటియాలా హౌస్ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కపిల్ గుప్తా ముందు హాజరైన నోరా ప్రతివాదులు- జాక్వెలిన్ వ్యాఖ్య‌లు అలాగే 15 మీడియా సంస్థల తప్పుడు కథనాలు ప్రజల దృష్టిలో తన ప్రతిష్టను నాశనం చేశాయని పేర్కొంది. వారు నన్ను గోల్డ్ డిగ్గర్ అని కామెంట్ చేసారు. కాన్ ఆర్టిస్ట్ సుఖేష్ చంద్రశేఖర్‌తో నాకు సంబంధం ఉందని నిరాధారంగా ఆరోపించారని నోరా ఈ వాంగ్మూలం లో పేర్కొంది. ఈ కేసు వల్ల నాకు ఆర్థిక భారంతో పాటు పరువు నష్టం వాటిల్లింది.

నేను తిరిగి కేసు పెట్టడానికి కారణం సుకేష్‌ పై 200 కోట్ల రూపాయల ముడుపులు అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈడీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీని గురించి నాకు ఏమీ తెలీదు! అని నోరా అంది. ఈ కేసు లో తనను బలిపశువుగా ఉపయోగించుకున్నార‌ని ఫతేహి తన ప్రకటన లో పేర్కొంది. కొంద‌రిని రక్షించడానికి మీడియాలో నన్ను బలిపశువుగా ఉపయోగించుకున్నారని.. నేను బయటి వ్యక్తి(విదేశీ వ్య‌క్తి)ని కాబ‌ట్టి నన్ను సాఫ్ట్ టార్గెట్‌ గా ఎంచుకున్నారని నోరా ఆరోపించింది. నా కెరీర్‌కు జరిగిన అన్ని నష్టాల కు పరిహారం కావాలని నేను భావిస్తున్నాను అని నోరా వాంగ్మూలంలో పేర్కొంది.

ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఈ కేసులో మరో సాక్షి వాంగ్మూలాన్ని సెప్టెంబర్‌లో నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో నోరా ఫతేహి కూడా సుకేష్ చంద్రశేఖర్ నుండి బహుమతులు అందుకున్నారని జాక్వెలిన్ చేసిన వ్యాఖ్యల పై నోరా పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ద్వేషపూరిత కారణాల వల్ల నిందితురాలు ఏ1 (జాక్వెలిన్) పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసారు. అంతే కాకుండా జాక్విలిన్ తన కెరీర్‌ ను నాశనం చేయడానికి నేరపూరితంగా పరువు తీయడానికి ప్రయత్నించింది. ప‌రిశ్ర‌మ పోటీ నుంచి త‌న‌ను ఎదుర్కోలేక ఇలా చేసింది అంటూ నోరా ఫతేహి ఫిర్యాదులో పేర్కొంది.

వాస్త‌వానికి ఇద్దరు నటీమణులు విదేశీ మూలానికి చెందినవారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎదిగే క్ర‌మంలో ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కొన్నారు. బోలెడంత పోరాటం సాగించారు. సుఖేష్ తో ఇద్ద‌రి సంబంధాల నేప‌థ్యంలో ఇరువురి న‌డుమా గొడ‌వ‌లు త‌లెత్తాయ‌ని మీడియా క‌థ‌నాలు రాసింది. సుకేష్‌ భార్య లీనా మారియా పాల్ ఒక నైట్ పార్టీలో స్పీకర్‌ఫోన్‌ లో తనతో మాట్లాడినప్పుడు మాత్రమే తాను సదరు కాన్ మ్యాన్‌తో మాట్లాడానని ఫిర్యాదులో నోరాఫతేహి తెలిపారు. పార్టీ నైట్ లీనా మారియా పాల్ స్వ‌యంగా జాక్విలిన్ కి ఐఫోన్ గూచీ బ్యాగ్ ని బహుమతిగా అందించింది. సుఖేష్ నుండి తాను ఎటువంటి బహుమతులు పొందలేదని నోరా పేర్కొంది.