Begin typing your search above and press return to search.

`ఫిఫా వరల్డ్ కప్ 2026` అధికారిక పాట‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న నోరా

అంతర్జాతీయ ఫుట్‌బాల్ పండుగ `ఫిఫా వరల్డ్ కప్ 2026` అధికారిక మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి పాడి- నర్తించిన ప్రత్యేక గీతం `సీర్ సీర్` ఎట్టకేలకు విడుదలైంది.

By:  Sivaji Kontham   |   10 Jun 2026 12:25 AM IST
`ఫిఫా వరల్డ్ కప్ 2026` అధికారిక పాట‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న నోరా
X

అంతర్జాతీయ ఫుట్‌బాల్ పండుగ `ఫిఫా వరల్డ్ కప్ 2026` అధికారిక మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి పాడి- నర్తించిన ప్రత్యేక గీతం `సీర్ సీర్` ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫిఫా వరల్డ్ కప్ అధికారిక గీతాలకు ఉండే ఒక ప్రత్యేకమైన గ్లోబల్ వైబ్, హై-ఎనర్జీ బీట్స్‌తో ఈ సాంగ్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా మ్యూజిక్ వీడియోలో నోరా ఫతేహి చూపించిన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్.. త‌న‌ అద్భుతమైన డ్యాన్సింగ్ స్టైల్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

ఈ పాట‌ గురించి నోరా ఫతేహి మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని భావోద్వేగానికి లోనయ్యారు. `ఈ `సీర్ సీర్` పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులను ఒకే చోట చేర్చి..ఒక వినూత్నమైన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా సృష్టించాలనుకున్నాము. నాలోని మొరాకో మూలాలు-నేను పెరిగిన కెనడియన్ వాతావరణంతో పాటు భారతదేశం -ఇక్కడి దక్షిణాసియా సమాజం నాపై చూపిన అపారమైన ప్రేమ, మద్దతును ఈ పాట ద్వారా ప్రతిబింబించాలని ఆశించాను. నా గుర్తింపులోని ప్రతి కోణాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం నాకు గర్వంగా ఉంది`` అని పేర్కొన్నారు.

ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వెనుక బలమైన భారతీయ ప్రాతినిధ్యం ఉండటం విశేషమని, ఇది తనకు మరింత గర్వాన్ని ఇస్తోందని నోరా వెల్లడించారు. ఈ మ్యూజిక్ వీడియోకు పనిచేసిన కొరియోగ్రాఫర్, తోటి నృత్యకారులు - స్టైలింగ్ టీమ్ వరకు ప్రతి ఒక్క విభాగంలోనూ భారతీయులు తెరవెనుక ఉండి కీలక పాత్ర పోషించారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఒక అంతర్జాతీయ ఫిఫా వేదికపై భారతీయ సృజనాత్మకతను -ప్రతిభను ఈ స్థాయిలో ఆవిష్కరించేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప అవకాశంగా నిలిచిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

పాట విడుదలైన తక్షణమే నెటిజన్లు, ఫుట్‌బాల్ లవర్స్ సామాజిక మాధ్యమాలను తమ రియాక్షన్లతో ముంచెత్తారు. ``నోరా ఫతేహి ఫిఫా సాంగ్ నిజంగా అద్భుతంగా ఉంది.. ఒక అసలైన వరల్డ్ కప్ యాంథమ్‌కు ఉండాల్సిన లయ ఇందులో ఉంది`` అని ఒక యూజర్ కామెంట్ చేయగా..`` ఫిఫా ప్రపంచంలో షకీరా తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకునే సత్తా కేవలం నోరాకు మాత్రమే ఉంది`` అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

గతంలో కూడా ఫిఫా వేదికలపై తన నృత్యంతో అలరించిన నోరా ఫతేహి ఇప్పుడు 2026 వరల్డ్ కప్ కోసం విడుదల చేసిన `సీర్ సీర్` గీతంతో తన గ్లోబల్ అప్పీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ కల్చర్‌కు సరిపోయే హై-వోల్టేజ్ ఎనర్జీని ఈ పాటలో తీసుకురావడంలో ఆమె విజయం సాధించారు.