నోరా ది గ్రేట్: 5000తో ముంబైలో అడుగుపెట్టి 52కోట్ల సంపాదన!
అవమానాలు, వేధింపులు, చీదరింపులు ఎన్ని ఎదురైనా.. ప్రతిభ, కఠోర శ్రమ ఉంటే సరిహద్దులు చెరిపేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి నిరూపించారు.
By: Sivaji Kontham | 22 Jun 2026 9:55 AM ISTఅవమానాలు, వేధింపులు, చీదరింపులు ఎన్ని ఎదురైనా.. ప్రతిభ, కఠోర శ్రమ ఉంటే సరిహద్దులు చెరిపేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహి నిరూపించారు. కెనడాలో మొరాకో సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన నోరా.. చిన్న వయసులోనే తన కుటుంబాన్ని పోషించడం కోసం షాపింగ్ మాల్స్, పబ్బులు, క్లబ్బుల్లో పనిచేశారు. చాలీచాలని ఆదాయంతో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ కేవలం రూ.5,000 చేతిలో పట్టుకుని సినీ నగరి ముంబైలో అడుగుపెట్టారు. 2014లో `రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆరంభం ఆశించిన గుర్తింపు రాలేదు.
కానీ 2015లో వచ్చిన టాలీవుడ్ సంచలనం `బాహుబలి: ది బిగినింగ్` చిత్రంలోని `మనోహరి...` సాంగ్ నోరా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ 9, ఝలక్ దిఖలాజా వంటి పాపులర్ రియాలిటీ షోలలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక `సత్యమేవ జయతే` చిత్రంలోని `దిల్‌బర్`, `బాట్లా హౌస్`లోని `ఓ సాకీ సాకీ`, `స్ట్రీట్ డ్యాన్సర్ 3D` లోని `గర్మి` వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌లో తన అద్భుతమైన బెల్లీ డ్యాన్స్, ఫైరీ మూవ్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. నేడు నోరా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక డ్యాన్సింగ్ స్టార్ గా, ఫ్యాషనిస్టాగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్నారు.
ప్రస్తుతం నోరా ఫతేహి క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2026 ఆరంభ వేడుకల్లో తన డ్యాన్స్‌తో స్టేజ్‌పై అదరగొట్టిన ఈ బ్యూటీ గ్లోబల్ మ్యూజిక్ మార్కెట్‌లోకి కూడా దూసుకెళ్లారు. అంతర్జాతీయ స్థాయిలో పాప్ సింగర్‌గా ఎదగడం కోసం ప్రముఖ గ్లోబల్ రికార్డ్ లేబుల్ `వార్నర్ మ్యూజిక్ గ్రూప్` (WMG)తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల యో యో హనీ సింగ్‌తో కలిసి చేసిన `బాడీ రోల్` సాంగ్ కేవలం రెండు వారాల్లోనే 10 మిలియన్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం టీ-సిరీస్‌తో కొనసాగుతూనే మరోవైపు గ్లోబల్ ఆర్టిస్టులతో కలిసి నోరా పని చేస్తున్నారు.
ఈ తిరుగులేని క్రేజ్‌తో నోరా ఫతేహి సంపాదన- బ్రాండ్ వాల్యూ స్కైని టచ్ చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్కో ప్రమోషనల్ యాడ్ పోస్టింగ్‌కు.. అలాగే కార్పొరేట్ బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్ల కోసం భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. దేశీయ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల ప్రమోషనల్ కాంట్రాక్టుల కోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. దీనికి తోడు హిందీ బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎపిసోడ్ల వారీగా భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు.
నిరంతర శ్రమ, అంకితభావంతో దూసుకుపోతున్న నోరా ఫతేహి నికర ఆస్తి విలువ 2024 నాటికి సుమారు రూ.52 కోట్లకు చేరినట్లు అంచనా. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ వాచ్ బ్రాండ్ `జాకబ్ అండ్ కో` గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ జాకబ్ అరబో ఆమెకు రూ.35 లక్షల విలువైన లగ్జరీ వాచ్‌ను కానుకగా ఇచ్చి గౌరవించారు. ఒకప్పుడు కేవలం ఐదు వేల రూపాయలతో సామాన్యంగా మొదలైన ఒక సాధాసీదా యువతి ప్రయాణం... నేడు అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌కు ఫేస్‌గా మారే స్థాయికి ఎదగడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.
