సమ్మర్ అంతా వృధాగా పోతుందా!
సమ్మర్ అంటే సెలవులు సీజన్ కాబట్టి జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నా రిలీజ్ లు లేకపోవడంతో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది.
By: Tupaki Desk | 26 April 2025 1:00 AM ISTగత ఏడాది సమ్మర్ ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కుందో తెలిసిందే. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు దేవు డెరుగు? అసలు చిన్నా చితకా సినిమాలు కూడా రిలీజ్కు నోచుకోలేదు. దీంతో సమ్మర్ లో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ చేయాలనుకుంటే థియేటర్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేసి సినిమాలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత దశాబ్ధ కాలంలో ఏ సమ్మర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు.
సమ్మర్ అంటే సెలవులు సీజన్ కాబట్టి జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నా రిలీజ్ లు లేకపోవడంతో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది. 2025 సమ్మర్ పరిస్థితి అలాగే కనిపిస్తుందా అంటే సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్ కొనసాగుతుంది. ఇంకా మే ..జూన్ రెండు నెలలు భానుడి భగ భగలు తప్పవు. ఇప్పటికే సరైన రిలీజ్ లు లేక ప్రేక్షకుడికి ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది.
ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ కనిపించలేదు. బాలీవుడ్ ...హాలీవుడ్ సినిమాలు కూడా ఏవీ కనిపించలేదు. తెలుగు సినిమా గురించైతే చెప్పాల్సిన పనిలేదు. తమన్నా `ఓదెల 2`, `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` తప్ప ఇంకే సినిమా లేదు. ఈ రెండు కూడా రిలీజ్ అయి రోజులు గడుస్తోంది. ఈ వారం కూడా కొత్త సినిమాలేవి పెద్దగా కనిపించలేదు. నాని `హిట్ 3` సహా కొన్ని సినిమాలున్నా అవి థియేటర్లో సంచలనం సృష్టిస్తే తప్ప సాధ్యం కాదు.
హిట్ అయినా నెలలు తరబడి ఆడే పరిస్థితి ఉండదు. కాబట్టి సమ్మర్ ని పూర్తిగా ఆదుకోలేవు. ఇక స్టార్ హీరో సినిమా గురించైతే మాట్లాడుకునే పనేలేదు. ఒక్క స్టార్ సినిమా కూడా రిలీజ్ కు లేదు. అంతా జూన్ తర్వాత థియేటర్లోకి వస్తాం అంటున్నారు. దీంతో ఈ ఏడాది సమ్మర్ కూడా చాలా థియేటర్లు మూత పడే అవకాశం లేకపోలేదు.
