రామాయణం: 86 కెమెరాలతో 'ఇంటర్‌స్టెల్లార్' VFX టెక్నిక్
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 11:08 PM ISTనితీష్ తివారీ రామాయణం గురించి ప్రతి అప్ డేట్ భారతీయ ప్రజల్లో ఎంతో ఉత్సాహం నింపుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ సహా బడ్జెట్ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చయి. దాదాపు 1600 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణం భారతీయ సినిమా చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అన్న చందంగా ఎలివేషన్ తో ఉంటుందని చెబుతున్నారు.
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అత్యంత కీలకమైన శ్రీరాముడి తల్లి పాత్రలో కౌశల్యగా సీనియర్ బాలీవుడ్ నటి ఇందిరా కృష్ణన్ నటిస్తున్నారు. రణబీర్ యానిమల్ చిత్రంలో రష్మికకు తల్లిగా నటించిన ఇందిర ఇప్పుడు అనూహ్యంగా రణబీర్ కి తల్లిగా నటిస్తున్నారు. యానిమల్ చిత్రీకరణ సమయంలో రణబీర్ కి తల్లిగా నటించాలనుందని ఇందిర అన్నారట. అదే జ్ఞాపకంతో రణబీర్ ఆమెను తల్లి పాత్రకు ఎంపిక చేసుకున్నాడట. ఈ విషయాన్ని ఇందిర స్వయంగా చెప్పారు.
ఇదిలా ఉంటే, ఇందిర ఇప్పటివరకూ చిత్రబృందంలో ఎవరూ వెల్లడించని ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కోసం 86 కెమెరాల సెటప్ ని ఉపయోగిస్తున్నారని, `ఇంటర్‌స్టెల్లార్` కోసం ఉపయోగించిన VFX యంత్రాలు పని చేస్తున్నాయని ఇందిర వెల్లడించారు. ఇది నిజంగా ఆసక్తిని రేకెత్తించే విషయం. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఇంటర్ స్టెల్లార్ ఒక వెండితెర అద్భుతంగా కీర్తినందుకుంది. ఈ సినిమా కెమెరా పనితనం గురించి ప్రశంసలు కురిసాయి. అందుకే ఇప్పుడు నితీష్ తివారీ అలాంటి 86 కెమెరాల సెటప్ తో ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో చూడాలనే ఉత్కంఠను పెంచింది. రెండు భాగాలుగా రూపొందుతున్న `రామాయణం`లో మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళి కానుకగా విడుదల కానుంది.
