క్రియేటివ్ వీడియోతో తమ్ముడు రిలీజ్ డేట్ అప్డేట్
తమ్ముడు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ రిలీజ్ మాత్రం అనుకోని కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.
By: Tupaki Desk | 4 May 2025 12:29 PMరాబిన్‌హుడ్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కు ఆ సినిమా నిరాశే మిగిల్చింది. దీంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నింటినీ తమ్ముడు సినిమాపైనే పెట్టుకున్నాడు. ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమా కోసం నితిన్ ను డైరెక్ట్ చేశాడు.
తమ్ముడు సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ రిలీజ్ మాత్రం అనుకోని కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తమ్ముడు రిలీజవాల్సింది కానీ ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ డేట్ ఎప్పుడనేది కూడా మేకర్స్ వెల్లడించకపోవడంతో అందరూ తమ్ముడు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో వేణు శ్రీరామ్ బర్త్ డే రోజున మేకర్స్ ఓ వీడియో ను రిలీజ్ చేస్తూ, అందులో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో సినిమాలోని ప్రధాన తారాగణంగా నటించిన వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, స్వసిక ఒక్కొక్కరిగా వేణు శ్రీ రామ్ దగ్గరకు వస్తారు. వచ్చిన వాళ్లంతా ఆయనకు కనీసం విష్ చేయకుండా రిలీజెప్పుడంటూ సీరియస్ గా అడిగి ఒక్కొక్కరిగా వెళ్లిపోతారు. ఆఖరికి ఇక బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం లేదనుకునే టైమ్ కు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ముందు కేక్ కట్ చేద్దువు రా అని పిలిచి కేక్ పై తమ్ముడు జులై 4న రిలీజవుతుందనే విషయాన్ని రాసి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
ఈ ప్రమోషనల్ వీడియోను దిల్ రాజు ప్లాన్ చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియోలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం తో పాటూ ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే తమ్ముడులో ఈసారి వేణు శ్రీరామ్ ఏదో గట్టి ఎమోషనల్ రైడ్‌నే చూపించబోతున్నట్టు అనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు కాంతార, విరూపాక్ష మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.