ఫ్లాపుల పరంపర ఆగుతుందా?
‘రాబిన్ హుడ్’తో తన రాత మారుతుందనుకుంటే అది మరింత పెద్ద దెబ్బే కొట్టింది. దీంతో నితిన్ బాగా డీలా పడిపోయాడు.
By: Tupaki Desk | 3 July 2025 10:51 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం బాగా ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుల్లో నితిన్ ఒకడు. ఎప్పుడో 2020లో వచ్చిన ‘భీష్మ’ అతడి చివరి హిట్. ఆ తర్వాత అతడి నుంచి అరడజను చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మ్యాస్ట్రో’ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజైంది. అక్కడ వచ్చిన స్పందన ప్రకారం చూస్తే అది కూడా ఫ్లాపే. ఇక థియేటర్లలో రిలీజైన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్.. వరుసగా నితిన్‌కు షాకులే ఇచ్చాయి. ముఖ్యంగా చివరి మూడు చిత్రాలు అయితే దారుణమైన డిజాస్టర్లుగా మిగిలాయి.
‘రాబిన్ హుడ్’తో తన రాత మారుతుందనుకుంటే అది మరింత పెద్ద దెబ్బే కొట్టింది. దీంతో నితిన్ బాగా డీలా పడిపోయాడు. ఆ సంగతి తన కొత్త చిత్రం ‘తమ్ముడు’ ప్రమోషన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘రాబిన్ హుడ్’ టైంలో ఉన్నంత జోష్ లేదు. ఐతే ఈసారి హడావుడి చేయాల్సింది తాను కాదు.. సినిమా అని నితిన్ భావిస్తున్నట్లున్నాడు. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘తమ్ముడు’ కచ్చితంగా నితిన్ తలరాతను మారుస్తుందనే నమ్మకం టీంలో కనిపిస్తోంది. దీని టీజర్, ట్రైలర్ అంత ప్రామిసింగ్‌గా కనిపించాయి. రిలీజ్ ట్రైలర్ మరింత ఎగ్జైటింగ్‌గా కనిపించింది.
నిర్మాత దిల్ రాజు అయితే సినిమాపై మామూలు కాన్ఫిడెంట్‌గా లేడు. దర్శకుడు వేణు శ్రీరామ్.. తన కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటికి వచ్చి విభిన్నంగా ఏదో ట్రై చేశాడని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. కథ పరంగా వైవిధ్యంతో సాగుతూనే కమర్షియల్‌గానూ ఇది ఎంటర్టైన్ చేస్తుందని టీం చెబుతోంది.
బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ముందు వారాల్లో వచ్చిన ‘కుబేర’; ‘కన్నప్ప’ స్లో అయిపోయాయి. మంచి సినిమా పడితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని ‘కుబేర’తో రుజువైంది. కావాల్సిందల్లా మంచి టాకే. కాబట్టి ‘తమ్ముడు’కు టాక్ వస్తే.. నితిన్‌కు పెద్ద బ్రేక్ రావడం ఖాయం.
