'ఎల్లమ్మ' బలగం సిద్ధమైనట్లే!
‘బలగం’ సినిమా తెలంగాణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విధంగానే ‘ఎల్లమ్మ’ కూడా ఆకట్టుకుంటుందని టీమ్ ఆశిస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 11:18 AM ISTనితిన్ నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు యల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో ప్రేమకథ కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా నితిన్‌కు కొత్త ప్రయోగంగా నిలవనుందని అంటున్నారు.
నితిన్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘రాబిన్‌హుడ్’ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో రూపొందిన ‘తమ్ముడు’ సినిమాపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా పనులన్నీ పూర్తి చేసిన నితిన్, జూలైలో ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.
‘తమ్ముడు’తో హిట్ కొట్టాలని ఆశిస్తున్న నితిన్, ‘ఎల్లమ్మ’ సినిమాతో తన కెరీర్‌ను సరైన ట్రాక్‌లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ‘ఎల్లమ్మ’ సినిమా షూటింగ్ జూన్ లోనే మొదలవనుందట. ఇక నితిన్ ఈ షెడ్యూల్ కోసం డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం వేణు యల్దండి దాదాపు రెండేళ్లుగా స్క్రిప్ట్‌పై పనిచేశాడు.
తెలంగాణలోని ఒక చిన్న పట్టణంలో సాగే ఈ కథ, ఎమోషనల్ జర్నీని, వారి కలలు, సవాళ్లను చూపిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపించినప్పటికీ, హీరోయిన్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారని, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారని సమాచారం.
‘బలగం’ సినిమా తెలంగాణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విధంగానే ‘ఎల్లమ్మ’ కూడా ఆకట్టుకుంటుందని టీమ్ ఆశిస్తోంది. మొత్తంగా, ‘ఎల్లమ్మ’ సినిమా నితిన్ కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా టైమ్ లో విడుదల చేయాలని దిల్ రాజు టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. నితిన్ సరసన విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇక ‘ఎల్లమ్మ’తో నితిన్ ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.
