Begin typing your search above and press return to search.

ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో ఛాన్స్ మిస్?

రామాయణంలో శ్రీ‌రాముని తండ్రి(ద‌శ‌ర‌థుడు)గా అమితాబ్ బచ్చన్ నటించే వీలుంద‌ని కూడా ప్ర‌చారం ఉంది

By:  Tupaki Desk   |   20 March 2024 5:01 AM GMT
ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో ఛాన్స్ మిస్?
X

2023 బాలీవుడ్ కి హుషారు నింపింది. ఇదే ఉత్సాహంలో భారీ సినిమాలను మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నారు. వీటిలో దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న `రామాయణం` పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా రూపొందుతోంది. ర‌ణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా, సాయిప‌ల్ల‌వి సీత‌గా, య‌ష్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. స‌న్నీడియోల్ ఆంజ‌నేయునిగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కింగ్ దశరథ్‌గా నటించడానికి అంగీక‌రించారు. శూర్ప‌ణ‌ఖ‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా ఎంపిక‌య్యార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.

రామాయణంలో శ్రీ‌రాముని తండ్రి(ద‌శ‌ర‌థుడు)గా అమితాబ్ బచ్చన్ నటించే వీలుంద‌ని కూడా ప్ర‌చారం ఉంది. ఇందులో బాబి డియోల్ కి ఒక కీల‌క పాత్ర‌ను ఆఫ‌ర్ చేసార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌దానిపై స‌రైన స్ప‌ష్ఠ‌త లేదు. ఇటీవ‌ల తెలుగు యువ‌న‌టుడు న‌వీన్ పోలిశెట్టిని ఆ పాత్ర‌కు నితీష్ ఎంపిక చేసుకున్నార‌ని, `చిచ్చేరే` స‌మ‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌రిచ‌యంతో ఈ అవ‌కాశం వ‌చ్చింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనిని అధికారికంగా ధృవీక‌రించ‌లేదు.

తాజా స‌మాచారం మేర‌కు నితేష్ తివారీ రామాయణంలో లక్ష్మణుడి పాత్రను రవి దూబే పోషిస్తార‌ని తెలుస్తోంది. రవి దూబే టెలివిజన్ నటుడు కం నిర్మాత. `జమై రాజా` అనే టెలివిజన్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో విభీషణ్ పాత్రను పోషించడానికి మేకర్స్ హర్మన్ బవేజాను కూడా తీసుకున్నారు. ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లి ఫిల్మ్ సిటీలోని భారీ సెట్ల‌లో చిత్రీకరించనున్నారు.

రణబీర్ క‌పూర్ శ్రీ‌రాముడిగా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడ‌ని బుల్లితెర రామాయ‌ణంలో శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టించిన అరుణ్ గోవిల్ కితాబిచ్చిన సంగ‌తి తెలిసిందే. నితీష్ కాస్టింగ్ ఎంపిక‌ల కోసం చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నారు. ప్ర‌తిదీ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా న‌డిపిస్తున్నార‌ని స‌మాచారం. భారీ కాన్వాసుపై తెర‌కెక్కుతున్న మూడు భాగాల రామాయ‌ణంలో కీల‌క‌మైన ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌ను న‌వీన్ పోలిశెట్టి కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మే. అయితే అత‌డి షెడ్యూల్స్ అనుకూలంగా లేవ‌ని భావించాలా లేక ఇంకేదైనా కార‌ణ‌మా? ఏ కార‌ణంతో రామాయ‌ణం నుంచి వైదొలిగాడో తెలియాల్సి ఉంది.