స్వయంభు ఆలస్యానికి కారణమదే..!
ఈ సినిమాలో నిఖిల్ పోరాటయోధుడిగా కనిపించాల్సి ఉండగా, దాని కోసం అతను 8 నెలల పాటూ చాలా స్ట్రిక్ట్ డైట్ తో పాటూ మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు.
By: Tupaki Desk | 15 July 2025 5:54 PM ISTకార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ2 తో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచనతో పలు సినిమాలు సైన్ చేశారు నిఖిల్. అందులో భాగంగానే స్పై, 18 పేజెస్ సినిమాలు రాగా అవేమీ ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయాయి. ఇక అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా అయితే ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్లిందో కూడా తెలియదు.
క్రమంగా నిఖిల్ మార్కెట్ క్షీణిస్తూ వస్తుంది. దీంతో తర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నారు నిఖిల్. అందులో భాగంగానే నిఖిల్ ప్రస్తుతం తన దృష్టంతా స్వయంభు సినిమాపై పెట్టారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియాన్ మూవీ స్వయంభు. పీరియాడికల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నారు.
ఈ సినిమాలో నిఖిల్ పోరాటయోధుడిగా కనిపించాల్సి ఉండగా, దాని కోసం అతను 8 నెలల పాటూ చాలా స్ట్రిక్ట్ డైట్ తో పాటూ మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ వద్ద నిఖిల్ 45 రోజుల పాటూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగుకు సంబంధించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది.
నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న స్వయంభు షూటింగ్ ఒక్క రోజు మినహా షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ డేట్ దొరకగానే ఆ ఒక్క రోజు పెండింగ్ షూట్ ను కూడా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. షూటింగ్ పూర్తైనప్పటికీ ఈ సినిమాకు సీజీ, వీఎఫ్ఎక్స్ పోర్షన్స్ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ కు మరింత టైమ్ పడుతుందని తెలుస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఠాగూర్ మధు స్వయంభును నిర్మిస్తున్నారు.
