థియేటర్ లో స్నాక్స్ రేట్లపై తెలుగు హీరో గరం.. పట్టించుకుంటారా?
ఒకప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్ లో సినిమా చూడడం చాలా ఖరీదైపోయింది.
By: Tupaki Desk | 20 July 2025 2:57 PM ISTఒకప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్ లో సినిమా చూడడం చాలా ఖరీదైపోయింది. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లలో సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు టికెట్ పై మరింత ఎక్కువ ధర వడ్డిస్తారు. దీంతో మధ్య తరగతి వ్యక్తులు థియేటర్లకు రావాలంటే ఖర్చుకు భయపడిపోతున్నారు.
ఇక ఎలాగోలా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే, అక్కడ స్నాక్స్ పేరిట మరో దోపిడి! ఏది కొందామన్నా ధరలు భగ్గుమంటాయి. మనం తీసుకెళ్లేది లోపలికి అనుమతించరు. లోపల దొరికేవి మనం కొనుక్కోలేనం. అయినా కాస్త ధైర్యం చేసి ముందడుగు వేస్తే నలుగురున్న ఫ్యామిలీ ఏదో టైమ్ పాస్ కోసం తినే స్కాక్స్ కు వెయ్యికి పైనే ఖర్చుతుంది.
ఒక విధంగా చూసుకుంటే సినిమా టికెట్ ధర కంటే, థియేటర్ లోపల పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కే ఎక్కువగా ఖర్చు అవుతోంది. ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఇదే. ఫలితంగా ఇది సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ లను సైతం ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది. అయినా పట్టించుకునేవారేరీ?
అయితే టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ థియేటర్ స్నాక్స్ ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు సినిమా టికెట్ రేట్లు గురించి మాట్లాడుతూనే, పాప్ కార్న్ కూల్ డ్రింక్స్ ధరలపై స్పందించారు. ఈ సమస్యపై దృష్టి పెట్టాలని సంబంధిత సంస్థలను కోరారు. టికెట్ ధరను పరిమితం చేయాలి. కానీ థియేటర్ లోపల పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంంగా ఉన్నాయి.
నేను రీసెంట్ గా ఒక థియేటర్‌లో సినిమా చూశాను. అయితే సినిమా టికెట్ కంటే స్నాక్స్ కే నేను ఎక్కువ డబ్బులు ఖర్చు చేశాను. ఇది నన్ను షాక్ కు గురి చేసింది. దయచేసి దీనిపై దృష్టి పెట్టాలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రిక్వెస్ట్ చేస్తున్నా. బిగ్ స్క్రీన్ పై సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్యను పెంచండి. కనీసం మా వెంట తెచ్చుకున్న వాటర్ బాటిళ్లనైనా థియేటర్ లోపలికి తీసుకెళ్లేలా అనుమతించండి. అని నిఖిల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
నిఖిల్ ఇలా థియేటర్లలో స్నాక్స్ ధరలపై మాట్లాడడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. హీరో పోస్ట్ కు నెటిజన్లు పూర్తి మద్దతు ఇస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడైనా దీనిపై థియేటర్ యాజమాన్యాలు స్పందించాలని కోరుకుంటున్నారు. కానీ, ప్రేక్షకుల గోడు వినేవారెవరు?
