మెగా సిస్టర్స్ సాహసం: నిర్మాతలుగా వడ్డీలు చెల్లిస్తున్నారా?
మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలుగా సుస్మిత, నిహారికలకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
By: Sivaji Kontham | 2 March 2026 9:12 AM ISTమెగాస్టార్ చిరంజీవి కుమార్తెలుగా సుస్మిత, నిహారికలకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వెండితెర వెనుక ఒక నిర్మాతగా ఎదుర్కొనే సవాళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తన అక్క సుస్మిత సినిమా నిర్మాణం కోసం బయట వడ్డీలకు డబ్బులు తెచ్చి పడుతున్న రిస్క్ గురించి పెద తండ్రి చిరంజీవి గారు ఒక వేడుకలో ఆవేదన చెందడం, దానికి నిహారిక ఇచ్చిన వివరణపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నిహారిక ఒక నిర్మాతగా రూపొందించిన `రాకాస` మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
నిర్మాతగా సుస్మిత వడ్డీలకు తెచ్చి సినిమాలు నిర్మిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు కదా? అని నిహారికను తాజా ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించారు.. తండ్రి నాగబాబు ఆర్థికంగా మీకు సపోర్ట్ చేస్తున్నారా? అని కూడా ప్రశ్నించగా... నాగబాబు ఒక తండ్రిగా తనకు పాకెట్ మనీ అడ్జస్ట్ చేస్తారని నిహారిక తెలిపారు. అది తండ్రి కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మ్యాటర్ అని అన్నారు. `ఢీ` షో తర్వాత తాను నిర్మాతగా స్వయంగా సినిమాలు నిర్మిస్తున్నానని వెల్లడించారు. సినిమాల నిర్మాణానికి ఏదో ఒక రూపంలో తానే డబ్బును సమకూర్చుకుంటున్నాననే కాన్ఫిడెన్స్ నిహారికలో కనిపించింది.
నిజానికి సినిమా నిర్మాణం అంటే కేవలం గ్లామర్ ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక ఎంతో ఆర్థిక ఒత్తిడి ఉంటుందని గతంలో పలుమార్లు నిహారిక స్పష్టం చేశారు. మెగాస్టార్ కూతురైనా కానీ... సోదరి సుస్మిత తన కాళ్లపై తాను సొంతంగా నిలబడాలనే పట్టుదలతో ఇంట్లో డబ్బులు తీసుకోకుండా బయట ఫైనాన్స్ (వడ్డీలకు) తెచ్చి ప్రాజెక్టులు చేయడం గర్వంగా ఉందని అన్నారు. వడ్డీలు కడుతూ సినిమా నిర్మించడం అనేది కత్తి మీద సాము లాంటిదని.. సమయానికి సినిమా విడుదల కాకపోతే ఆ భారం రెట్టింపు అవుతుందని.. ఆ రిస్క్ చూసే చిరంజీవి గారు ఒక తండ్రిగా భయపడ్డారని మెగాప్రిన్సెస్ ఓ సందర్భంలో వివరించారు.
అక్క సుస్మిత పడుతున్న ఈ కష్టాన్ని చూసి..``నీకెందుకు ఈ వడ్డీల గొడవ, హాయిగా ఉండొచ్చు కదా`` అని చిరంజీవి గారు అన్న మాటల్లో ఒక తండ్రి ప్రేమ ఉందని నిహారిక పేర్కొన్నారు. అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వడ్డీలు కట్టాల్సి వస్తున్నా సరే.. సినిమాపై ఉన్న విపరీతమైన ఇష్టంతోనే సుస్మిత ఈ రంగంలో కొనసాగుతున్నారని కొనియాడారు. పరిశ్రమలో ఒక మహిళా నిర్మాతగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం సామాన్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, సుస్మిత వడ్డీలకు డబ్బు తెచ్చి సినిమాలు తీసే రిస్క్ చేస్తున్న నిర్మాత అయితే.. నిహారిక అదే రంగంలో ధైర్యవంతురాలిగా సినిమాల నిర్మాణంలో కొనసాగాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. `కమిటీ కుర్రోళ్లు` తర్వాత ఇప్పుడు రాకాస చిత్రంతో నిర్మాతగా నిహారిక పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షిద్దాం. కమిటీ కుర్రోళ్లు సినిమాకి బాబాయ్ పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని ప్రయత్నించినా వీలుపడలేదు. కనీసం `రాకాస` మూవీ ప్రమోషన్స్ కి అయినా సహకరిస్తారేమో చూడాలి. ఏప్రిల్ 3న `రాకాస` మూవీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
