డ్రీమ్ మూమెంట్.. టామ్ క్రూజ్‌తో నిహారిక!
టామ్ క్రూజ్.. ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 11:19 AM ISTటామ్ క్రూజ్.. ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. రియల్ స్టంట్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న టామ్ క్రూజ్ ను ఒక్కసారైనా రియల్ గా చూడాలి అని అనుకునేవారి సంఖ్య చాలానే ఉంటుంది. అలాంటి హీరోతో ఫొటో దక్కిన సంతోషమే అని చాలామంది సెలబ్రెటీలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అలాంటి డ్రీమ్ మూమెంట్ ను దక్కించుకుంది నిహారిక.
కంటెంట్ క్రియేటర్ గా నిహారిక మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ టాప్ స్టార్స్ అందరితో కూడా ఆమె సినిమా ప్రమోషన్ లో భాగంగా కంటెంట్ క్రియేషన్స్ తో హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌ను కలిసిన ఆమె, ఈ భావోద్వేగ క్షణాన్ని ఒక రీల్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ ప్రీమియర్‌లో అతిథిగా హాజరైన నిహారిక, టామ్ క్రూజ్‌తో గడిపిన ఈ అద్భుత క్షణాన్ని “ఈ మిషన్ సాధ్యమవడం నా ఆత్మను ఉర్రూతలూగించింది. ఈ శతాబ్దంలోనే రీబూట్ అవ్వాలి. టామ్ క్రూజ్, నీవు నిజంగా అద్భుతమైన వ్యక్తివి. నేను కలలో కూడా ఊహించని ఈ కలను నిజం చేసినందుకు ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నిహారిక ముఖంలో సంతోషం, ఆనందం స్పష్టంగా కనిపించాయి. టామ్ క్రూజ్ కూడా చాలా సౌమ్యంగా వ్యవహరించి, ఆమెతో కాసేపు గడిపాడు. ఈ క్షణం నిహారిక జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నిహారిక తెలుగును చక్కగా మాట్లాడగలదు. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కెరీర్‌ను ఆశించవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
నిహారిక ఎన్ఎం కంటెంట్ క్రియేటర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. సెలబ్రిటీలతో ఆమె చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె గుర్తింపు పెరిగింది. ‘మేజర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఆమె చేసిన వీడియో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటిగా కూడా ఆమె అడుగులు వేసింది, తమిళ సినిమా ‘పెరుసు’లో ఆమె నటన అందరినీ ఆకర్షించింది.
తాజాగా నిహారిక విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఆమె భాగమవుతున్నట్లు సమాచారం. నిహారిక కంటెంట్ క్రియేటర్‌గా మొదలై, నటిగా ఎదుగుతూ, ఇప్పుడు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ స్టార్‌తో కలిసి కనిపించడం ఆమె ప్రయాణాన్ని చూపిస్తోంది. ఇక ‘మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ సినిమా భారత్‌లో మే 17న విడుదలైంది.
